అనుపమ పరమేశ్వరన్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే తమిళ 'లాక్ డౌన్'. లైకా ప్రోకడక్షన్స్ వారు నిర్మించిన సినిమా ఇది. జీవా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే 'లాక్ డౌన్' నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినందువలన, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
'చెన్నై'లోని ఓ కాలనీలో అనిత (అనుపమ పరమేశ్వరన్) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తండ్రి సురేశ్ - తల్లి సుగుణ (నిరోషా) చెల్లి నికిత .. బామ్మ ఇదీ ఆమె ఫ్యామిలీ. సురేశ్ ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ఉంటాడు. తండ్రికి ఆర్థికంగా తోడుగా నిలబడటం కోసం అనిత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆమె ఓ ఫ్రెండ్ ను కలవడానికి వెళుతుంది. అక్కడ పార్టీ జరుగుతూ ఉండటంతో, మద్యం తీసుకుంటుంది. ఆ మత్తులో అక్కడే పడిపోతుంది.
కొన్ని రోజుల తరువాత తాను గర్భవతిననే విషయం అనితకి తెలుస్తుంది. దాంతో ఈ విషయాన్ని తన స్నేహితురాలు స్వప్నకి చెబుతుంది. ఆ రోజున తాను పార్టీకి వెళ్లినప్పుడు మత్తులో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే వాళ్లు ఆత్మహత్య చేసుకుంటారని ఆందోళన చెందుతుంది. రహస్యంగా అబార్షన్ చేయించుకోవడం తప్ప మరో మార్గం లేదని అంటుంది. తాను తోడుగా ఉంటానని స్వప్న ధైర్యం చెబుతుంది.
అబార్షన్ తతంగాన్ని రహస్యంగా చేసే డాక్టర్ కోసం అనిత - స్వప్న కలిసి గాలించడం మొదలుపెడతారు. అప్పటికే కోవిడ్ కేసులు పెరిగిపోతూ ఉంటాయి. అబార్షన్ కి అనిత సిద్ధపడేలోగా 'లాక్ డౌన్' ప్రకటన వెలువడుతుంది. కొన్ని వారాల పాటు బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు అనిత ఏం చేస్తుంది? ఆ తరువాత చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేది కథ.
నిజంగా 'లాక్ డౌన్' అనే పేరు వినగానే ఎవరైనా ఒకింత ఆందోళనకి లోనవుతారు. ఎందుకంటే ఆ రోజులు .. ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు .. పడిన కష్టాలు కళ్లముందు కదలాడతాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన సమస్యలో చిక్కుకుపోయారు. 'లాక్ డౌన్' ఎప్పుడు ఎత్తేస్తారా అని వేయి కళ్లతో వెయిట్ చేశారు. అలా ఈ కథలో 'అనిత' ఒక చిత్రమైన సమస్యలో చిక్కుకుపోతుంది.
ఇంట్లో వాళ్లకి అనిత తన సమస్యను చెప్పుకోలేదు. కోవిడ్ కారణంగా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఎవరు కారకులో తెలియని బిడ్డ, ఆమె కడుపులో పెరుగుతుంటాడు. తన గురించి .. తన తల్లిదండ్రులను గురించి .. పరువు ప్రతిష్ఠల గురించి ఆలోచన చేస్తూ ఆమె సతమతమైపోతూ ఉంటుంది. చుట్టూ ఇలాంటి ఒక సమస్యాత్మక వాతావరణాన్ని సృష్టించి, ఆ మధ్యలో నుంచి అనిత పాత్రను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఒక రహస్యాన్ని దాచడం .. ఒక ఆపదని దాటడం అనుకున్నంత తేలిక కాదు. ఆపదలో .. అవసరంలో ఉన్నవాళ్లను తమకి అనుకూలంగా ఉపయోగించుకోవడానికీ .. మోసం చేయడానికి చాలామంది సిద్ధంగానే ఉంటారు. అలాంటివాళ్లను దాటుకుని ఒక అమ్మాయి ముందుకు వెళ్లడం ఎంత కష్టమనేది ప్రత్యక్షంగా అనుభవించినవారికే అర్థమవుతుంది. అలా అనిత ఎదుర్కొనే సమస్యలను డిజైన్ చేసిన విధానం సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది.
ఎవరికైనా కుటుంబమే బలం. కుటుంబం అండగా నిలబడితే ఆ ధైర్యమే వేరు. కానీ ఆ కుటుంబానికే తెలియకుండా ఒక అమ్మాయి తన పొరపాటును దాచడానికి ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనేది దర్శకుడు చూపించిన తీరు వాస్తవానికి చాలా దగ్గరగా తీసుకుని వెళుతుంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచడమే అసలైన తప్పు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
అనుపమా పరమేశ్వరన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. బలమైన కథలను .. బరువైన పాత్రలను పోషించిన అనుభవం తనకి ఉంది. అందువలన ఆమె నటన ఆకట్టుకుంటుంది. అనుపమ పాత్ర తప్ప ఆమె కనిపించదు. ఇక ఆమె తల్లి పాత్రలో నిరోషా .. ఇతర పాత్రలను ధరించిన ఆర్టిస్టులంతా బాగా చేశారు.శక్తివేల్ ఫొటోగ్రఫీ .. రఘునాథన్ నేపథ్య సంగీతం .. సాబూ జోసెఫ్ ఎడిటింగ్ పనితనం బాగుంది.
మిడిల్ క్లాస్ కుటుంబాలు పరువు ప్రతిష్ఠలే ప్రాణంగా బ్రతికేస్తూ ఉంటాయి. అందువలన అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. 'లాక్ డౌన్' నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ ఓ మాదిరిగా అనిపిస్తుంది. అందుకు కారణం లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు రావడమే .. ఈ తరహా కాన్సెప్ట్ పాత బడటమే.
'లాక్ డౌన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Lockdown Review
Movie Details
Movie Name: Lockdown
Release Date: 2026-03-11
Cast: Anupama Parameswaran, Charle, Livingston, Nirosha, Priya Venkat
Director: AR Jeeva
Music: Raghunanthan
Banner: Lyca Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer