అలెన్ రిచ్ సన్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'వార్ మెషీన్'. సైన్స్ ఫిక్షన్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. 'నెట్ ఫ్లిక్స్' ద్వారా ఈ నెల 6వ తేదీన నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. పాట్రిక్ హ్యూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

 అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్ సన్). అతను ఒకానొక సమయంలో శత్రువుల దాడి నుంచి తన తమ్ముడిని కాపాడలేకపోతాడు. తాను రేంజర్ కావాలనేది తన తమ్ముడి 'కల'  కనుక, దానిని నెరవేర్చాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం శిక్షణ సమయంలో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటాడు. 8 వారాల శిక్షణ సమయంలో చివరికి వచ్చేసరికి 15 మంది మాత్రమే మిగులుతారు. చివరి పరీక్ష ఒక పర్వత ప్రాంతంలో మొదలవుతుంది. 

ముందుగా ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక డమ్మీ విమానాన్ని పేల్చేసి, తిరుగుబాటుదారుల నుంచి ఆ పైలెట్ ను రక్షించి తీసుకుని రావలసి ఉంటుంది. అందుకోసం పర్వత సమూహం దగ్గరికి వెళ్లిన టీమ్, చిత్రమైన ఆకృతిలో తయారు చేయబడిన ఒక విమానాన్ని పేల్చేస్తారు. దాంతో ఆ విమానం ఒక రోబోలా మారిపోతుంది. ఎక్కడ ఎవరున్నా స్కాన్ చేసి ఫైరింగ్ చేస్తూ వెంటాడటం మొదలుపెడుతుంది. ఎంతటి శక్తిమంతమైనదానినైనా క్షణాల్లో బూడిదగా మార్చేస్తూ ఉంటుంది.

ఆర్మీ అధికారులు సెట్ చేసిన డమ్మీ ఫ్లైట్ వేరు .. తాము పేల్చడానికి ప్రయత్నించిన ఫ్లైట్ వేరనే విషయం టీమ్ కి అర్థమవుతుంది. తాము తప్పుడు లొకేషన్ కి వెళ్లామనే విషయాన్ని గ్రహిస్తారు. తమపై దాడి చేస్తున్న రోబో, కచ్చితంగా ఈ గ్రహానికి సంబంధించినది కాదనే నిర్ధారణకు వస్తారు. ఆ మెషీన్ ను టీమ్ ఎలా ఎదుర్కొంటుంది? దాని బారి నుంచి వాళ్లంతా బ్రతికి బయటపడతారా? రేంజర్ సెలక్షన్స్ లో భాగంగా తమకి ఇచ్చిన టార్గెట్ ను వాళ్లు పూర్తి చేస్తారా? అనేది మిగతా కథ.

అమెరికన్ ఆర్మీలో రేంజర్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఫైనల్ రౌండ్ కోసం మిగిలిన వాళ్లతో 'డెత్ మార్చ్' పేరుతో ఒక డమ్మీ ఆపరేషన్ ను నిర్వహిస్తారు. అందుకోసం పర్వత ప్రాంతానికి వెళ్లిన 15 మంది అభ్యర్థులు అక్కడ ఓ ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ ప్రమాదంలో నుంచి బయటపడటానికీ .. అలాగే తమకి పైఅధికారులు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయడానికి రంగంలోకి దిగిన ఆ టీమ్ ఏం చేస్తుందనేది ఉత్కంఠను రేకెత్తించే అంశం. 

మొదటి అరగంట అంతా కూడా రేంజర్ కి సంబంధించిన శిక్షణతో నడుస్తుంది. ఆ శిక్షణలో భాగంగా పర్వత ప్రాంతానికి చేరుకున్న 15 మంది బృందం ఊహించని ప్రమాదంలో చిక్కుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. కథ అంతా కూడా హీరోతో కలిసి నడిచే ఈ 15 మంది చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రేక్షకుడు తల పక్కకి తిప్పలేడు. ఏం జరుగుతుందో .. ఎటువైపు నుంచి రోబోలాంటి మెషీన్ విరుచుకుపడుతుందో అనే ఒక టెన్షన్ పెరుగుతూ పోతుంది.

మొదటిసారిగా రోబోలాంటి యంత్రం దాడి చేయడం .. టీమ్ లోని సభ్యులను వెంటాడటం .. వాళ్లంతా పర్వతంపై నుంచి దొర్లిపోవడం .. ఉద్ధృతంగా ప్రవహించే నదిని దాటడం .. జలపాతంలో నుంచి పడిపోవడం .. ఆర్మీ ట్యాంకర్ ను మెషిన్ ఛేజ్ చేయడం వంటి  సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా నదిని దాటే సీన్ ఆడియన్స్ ను చాలా టెన్షన్ పెట్టేస్తుంది. ఈ సన్నివేశాాలను డిజైన్ చేసిన తీరు బాగుంది. 

హీరోతో పాటు మిగిలిన ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం మంచి మార్కులు కొట్టేస్తుంది. పర్వతాలు .. నదులు .. ఫారెస్ట్ నేపథ్యంతో కూడిన లొకేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పచ్చు. ఒకరకంగా లొకేషన్స్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయని కూడా అనుకోవచ్చు. 

అమెరికన్ ఆర్మీలో రేంజర్ సెలక్షన్స్ ఏ రేంజ్ లో జరుగుతాయి? ఎలాంటి కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది? ఆ శిక్షణ వాళ్లకి ఎలా ఉపయోగపడుతుంది? అనేది చూపించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నిజమైన సెలక్షన్స్ జరుగుతున్నట్టుగానే ఈ ఎపిసోడ్ అంతా ఉంటుంది.

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి పోటీపడ్డాయని చెప్పాలి. ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ కనిపించవు. ఎక్కడా అసభ్యకరమైన .. అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవు. రక్తంతో కూడిన గాయాలు .. కాలిపోయిన శవాలకు సంబంధించిన క్లోజప్ షాట్స్ మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయి.

సైన్స్ ఫిక్షన్ తో కూడిన యాక్షన్ మూవీ ఇది. అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగుతుంది. మొదటి అరగంటను కాస్త లీడ్ గానే భావించాలి. ఆ తరువాత నుంచే అసలు కథ మొదలవుతుంది. కథ పాతదే అయినా, ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. లొకేషన్స్ .. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు బలాన్ని పెంచుతూ వెళ్లాయి. ఈ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చే కంటెంట్ గా చెప్పుకోవచ్చు.