అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ డ్రామా 'సుబేదార్'. సురేశ్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా 'అమెజాన్ ప్రైమ్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. మార్చి 5వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ముందుగానే చెబుతూ వచ్చారు. అలాగే ఈ సినిమా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. అనిల్ కుమార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది.
సుబేదార్ అర్జున్ మౌర్య (అనిల్ కపూర్) పదవీ విరమణ అనంతరం తిరిగొస్తాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య సుధా మౌర్య (ఖుష్బూ) చనిపోతుంది. కూతురు శ్యామా (రాధిక మదన్) అక్కడి డిగ్రీ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. చనిపోవడానికి ముందు తన భర్తకి కానుకగా ఇవ్వడం కోసం సుధ ఒక 'జిప్సీ'ని బుక్ చేస్తుంది. పచ్చళ్ల బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుతో భార్య తీసుకున్న ఆ జిప్సీ అంటే, సుబేదార్ కి ఎంతో అపురూపం.
సుబేదార్ ఆ ఊరుకు వచ్చేసరికి అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. 'బబ్లీ దీదీ' (మోనా సింగ్) జైలుకు వెళ్లడంతో, ఆమె కనుసన్నలలో తమ్ముడు ప్రిన్స్ (ఆదిత్య రావల్) ఆమె ప్రధానమైన అనుచరుడు సాఫ్టీ (ఫైజల్) ఇసుక మాఫియాను నడిపిస్తూ ఉంటారు. నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతూ ఉండటం వలన, ఆ ఏడాదిలో 15 మంది పిల్లలు ఆ గోతులలో పడి చనిపోతారు. ఈ విషయాన్ని మీడియాకి చెప్పడానికి ప్రయత్నించిన వాళ్లను కూడా ప్రిన్స్ చంపేస్తూ ఉంటాడు.
పార్కింగ్ విషయంలో ప్రిన్స్ కీ .. సుబేదార్ కి మొదలైన గొడవ పెరుగుతూ వెళుతుంటుంది. బబ్లీ దీదీ జైలు నుంచి బయటికి రావాలంటే, ఆ కేసులో కీలక ఆధారమైన 'గన్' ఒకటి దొరకాలి. ఆ గన్ సుబేదార్ దగ్గర ఉంటుంది. దాని కోసం అతణ్ణి ప్రిన్స్ టార్గెట్ చేస్తాడు. ఇక కాలేజ్ లో 'రణ్ వీర్' అనే రౌడీ స్టూడెంట్, తనకి సంబంధించిన ఒక వీడియో కోసం సుబేదార్ కూతురు శ్యామాను టార్గెట్ చేస్తాడు. ఈ ప్రమాదాల నుంచి తండ్రీ కూతుళ్లు ఎలా బయటపడతారు? అనేది కథ.
సురేశ్ త్రివేణి - ప్రజ్వల్ చంద్రశేఖర్ తయారు చేసుకున్న కథ ఇది. ఒక ఊళ్లో ఇసుక మాఫియా నడిపించే అక్కాతమ్ముళ్ల కారణంగా, ఒక సుబేదార్ కుటుంబం ఎదుర్కొనే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చుట్టూ అనుచరులు .. చేతిలో ఆయుధాలు .. తమ గురించి ఎవరు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ఉన్నప్పుడు లోకల్ మాఫియా లీడర్లు రెచ్చిపోతుంటారు. అందుకు సంబంధించిన అంశం చుట్టూ అల్లుకున్న ఈ కథ, మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఒక వైపున భార్య జ్ఞాపకాలు .. ఒక వైపున తనని అపార్థం చేసుకున్న కూతురు .. మరొక వైపున స్థానికంగా ఉన్న గూండాయిజాన్ని ఎదుర్కొనే సుబేదార్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. తనలోని సహనం పూర్తిగా నశించినప్పుడే తిరగబడే ఈ పాత్ర, ఈ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఇక అలాంటి సుబేదార్ ను రెచ్చగొట్టే ఆకతాయి రౌడీ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. దాదాపుగా కథ అంతా ఈ రెండు పాత్రల మధ్యనే నడుస్తుంది.
సమస్య వేరైనా .. శత్రువులు వేరైనా .. అటు తండ్రీ .. ఇటు కూతురు ఒకే సమయంలో .. ఒకే విధమైన ప్రమాదంలో పడటం కొత్తగా అనిపిస్తుంది. అలా చేసిన స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది కూడా. సుబేదార్ భార్య వైపు నుంచి .. కూతురు వైపు నుంచి .. ఊళ్లోని ఇసుక మాఫియా బాధితుల వైపు నుంచి ఎమోషన్ ను కనెక్ట్ చేయగలిగారు. ఈ ఎమోషన్ వల్లనే యాక్షన్ సీన్స్ మరింత బలంగా అనిపిస్తాయి.
పార్కింగ్ విషయంలో సుబేదార్ కీ .. ప్రిన్స్ కి మధ్య జరిగే గొడవ సీన్, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే జిప్సీ ని రౌడీలు డామేజ్ చేసే సీన్ .. ఇంటిపై దాడి చేయడానికి వచ్చిన రౌడీల బారి నుంచి తన కూతురును రక్షించుకునే సీన్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మనకి రజనీకాంత్ 'జైలర్' సినిమాను గుర్తుచేస్తాయి.
అనిల్ కపూర్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవసిన పనిలేదు. అయితే లోకల్ డాన్ తమ్ముడిగా ప్రిన్స్ పాత్రలో ఆదిత్య రావల్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఆయన నటన సన్నివేశాలను సహజత్వానికి మరింత దగ్గరగా తీసుకుని వెళ్లిందని చెప్పచ్చు. ఇక మిగిలిన పాత్రధారులంతా మెప్పించారు.
కథ - స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పాలి. ఎక్కడా లూజ్ సీన్స్ లేకుండా చేసిన ఆవిష్కరణ ఆకట్టుకుంటుంది. అజయ్ సక్సేనా ఫొటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం కథలో నుంచి జారిపోనీయకుండా అలా సన్నివేశాల వెంట పరిగెత్తిస్తుంది. శివ్ కుమార్ పణికర్ ఎడిటింగ్ పనితీరు సంతృప్తికరంగా అనిపిస్తుంది.
యాక్షన్ .. ఎమోషన్ తో ముడిపడిన ఈ కథ, మొదటి నుంచి చివరివరకూ అలా కూర్చోబెట్టేస్తుంది.
అక్కడక్కడా సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు, 'జైలర్' సినిమాను గుర్తుచేస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
'సుబేదార్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Subedaar Review
Movie Details
Movie Name: Subedaar
Release Date: 2026-03-05
Cast: Anil kapoor, Radhika Madan, Khushbu Sundar, Saurabh Shukla, Adithya Rawal, Mona Singh
Director: Suresh Triveni
Music: -
Banner: Abundantia Entertainments
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer