'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన విడుదలైన తమిళ సినిమానే 'పూకీ'. తెలుగులో ఈ సినిమాను 'బూకీ' పేరుతో విడుదల చేశారు. విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో, నాయికగా ధనూషా అలరించింది. గణేశ్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ ఆంటోని తన సొంత బ్యానర్ పై నిర్మించడమే కాకుండా, సంగీతాన్ని సమకూర్చాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 13వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

వైజాగ్ కి చెందిన  మిడిల్ క్లాస్ యువకుడు కైలాశ్ (అజయ్ దిశాన్). అతను .. ఆశ ( ధనూష) ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటారు. తనని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అతను ఎంత మాత్రం సహించడు. అతని తొందరపాటు పట్ల ఆశ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఇద్దరూ నడి రోడ్డుపై గొడవపడవలసి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు సెల్ ఫోన్స్ లో వీడియో తీయడంతో ఆ సంఘటన కాస్తా వైరల్ అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోతుంది.

బ్రేకప్ అయితే చెప్పుకుంటారుగానీ .. ఇద్దరూ ఒకరిని ఒకరు మరిచిపోలేకపోతుంటారు. తమ మనసును మళ్ళించడం కోసం కైలాశ్ 'జిమ్'కి వెళ్లడం మొదలుపెడతాడు. ఆశ ఆధ్యాత్మికత వైపు వెళుతుంది. అయినా అక్కడ కూడా వారికి తాము ఆశించిన రిజల్ట్ మాత్రం కనిపించదు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరికీ కూడా స్నేహితులు ఒక విషయం చెబుతారు. ఒకరిని పూర్తిగా మరిచిపోవాలంటే, మరొకరిని కొత్తగా జీవితంలోకి ఆహ్వానించాలని అంటారు. 

ఆ మాట వాళ్లకి సరైనదిగానే అనిపిస్తుంది. స్వామిజీ ఆశ్రమంలో పరిచయమైన 'రాహుల్' తో ఆశ సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెడుతుంది. అలాగే కైలాశ్ కూడా, శ్రీమంతుల కుటుంబానికి  చెందిన 'కావ్య'కి చేరువవుతూ ఉంటాడు. కొత్తగా మొదలైన వారి ప్రేమకథలు ఏ తీరానికి చేరుకుంటాయి? వాళ్లిద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ. 

ఈ తరం అమ్మాయిలు - అబ్బాయిలు ఎంత వేగంగా ప్రేమించుకుంటున్నారో .. అంతే వేగంగా విడిపోతున్నారు. ఒకరినొకరు చాలా తేలికగా మరిచిపోయి, మరొకరితో ముందుకు వెళ్లిపోతున్నారు. అలా తేలికగా బ్రేకప్ చెప్పుకుని విడిపోయిన ఒక జంట కథనే ఇది. బ్రేకప్ జరిగినట్టేనా? అయినా ఎందుకు ఒకరిని ఒకరు మరిచిపోలేకపోతున్నాం? అని ఆలోచనలో పడే ఒక పడుచుజంట చుట్టూ రాసుకున్న కథ ఇది.             

ప్రేమలో పడినప్పుడు ప్రపంచం చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. విడిపోయినప్పుడు కలిగే బాధవేరు .. విడిపోయిన తరువాత తమ ఎక్స్ వేరొకరితో కలిసి తిరగడం చూస్తే కలిగే బాధ మరింత ఎక్కువ. తమ తప్పును ఒప్పుకోలేరు .. వెనక్కి వెళ్లడానికి ఒప్పుకోరు. అలాంటి ఒక మానసిక సంఘర్షణ చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది. 

కథకి తగిన పాత్రలను ఎంచుకుని .. అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తెరపైకి తీసుకొస్తూ దర్శకుడు ముందుకు వెళ్ళాడు. హీరో - హీరోయిన్ కుటుంబాల వైపు నుంచి కూడా ఈ కథను ఎమోషనల్ గా టచ్ చేస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా తీసుకుని వెళ్ళాడు. ఫస్టాఫ్ లో సరాదాగా సాగే ప్రేమ - సెకండాఫ్ లో సంఘర్షణ అన్నట్టుగా ఈ కథ నడుస్తుంది. అయితే అవసరమైన చోటున కామెడీ టచ్ ఇస్తూ ఆడియన్స్ పై కాస్త ఒత్తిడిని తగ్గించారు. 

ఈ జనరేషన్ లో ప్రేమలు ఎలా మొదలవుతున్నాయి .. ప్రేమజంటలు ఎలా విడిపోతున్నాయనేది దర్శకుడు చూపించిన విధానం వాస్తవ పరిస్థితులకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఈ జనరేషన్ కి చెందిన చాలామంది అబ్బాయిలు .. అమ్మాయిలు ఈ పాత్రలలో తమని తాము చూసుకోకుండా ఉండలేరు. పాత ప్రేమకథలలోకి వెళ్లకుండా ఉండలేరు. 

ప్రేమించుకోవడాలు .. బ్రేకప్ లు చెప్పుకోవడాలు మామూలేగదా. ఇందులో కొత్తదనం ఏవుందని అనుకోవచ్చు. అయితే మొదటి ప్రేమలో ఉన్న అందం .. ఆనందం .. అనుభూతి ఆ తరువాత ఉండదనే పాయింట్ ను టచ్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది .. అదే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎవరెన్ని చెప్పినా మన మనసు ఎవరినైతే వదులుకోలేకపోతుందో వాళ్లపై ఉన్నదే నిజమైన ప్రేమ అనే విషయాన్ని స్పష్టం చేసిన తీరు మెప్పిస్తుంది. 

హీరో .. హీరోయిన్ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.మిగతా ఆర్టిస్టులు కూడా చాలా సహజంగా చేశారు. విజయ్ ఆంటోని అందించిన సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది .. ఎడిటింగ్ ఓకే. గణేశ్ చంద్ర ఫొటోగ్రఫీ ఫరవాలేదు.

కన్నవాళ్ల కలలు ఏమిటనేది తెలుసుకుని పిల్లలు వాటిని నెరవేర్చాలి. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని వాళ్లను సంతోషంగా ఉంచాలనే ఒక సందేశం ఈ కథలో కనిపిస్తుంది. కథలో అనూహ్యమైన మలుపులు .. భారీ డ్రామా ఉండదు. ఈ జనరేషన్ కి తగిన కంటెంట్ .. వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే నడుస్తుంది అంతే.