'కజిన్స్ అండ్ కల్యాణమ్స్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

ఫ్యామిలీ డ్రామాలకు ఆదరణ అనేది ఎప్పటికీ ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ సరదాగా సాగిపోయే ఈ తరహా కథలకు ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతుంటారు. అలాంటి ఒక సిరీస్ ఇప్పుడు మలయాళం నుంచి వచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఆ సిరీస్ పేరే 'కజిన్స్ అండ్ కల్యాణమ్స్'. నిజూ సోమన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో మొత్తం 60 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ ..కన్నడ ..హిందీ భాషల్లో అందుబాటులోకి  వచ్చింది. ఈ సిరీస్ నుంచి ప్రతి శుక్రవారం 4 ఎపిసోడ్స్ ను వదలనున్నారు. 
 
మనూ (కృష్ణ విజయచంద్ర) చందూ (సిద్ధార్థ్) దియా (మనస్విని) అశ్వతి (నైనిత) సంస్కృతి (మాన్య) మేఘ (నందిత) వీళ్లంతా కజిన్స్. కేరళకు చెందిన ఈ కుటుంబాలన్నీ కూడా ఎక్కడెక్కడో నివసిస్తూ ఉంటాయి. అందువలన బంధువుల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ లో తప్పకుండా కలుసుకుంటూ ఉంటారు. అందువలన పిల్లలందరి మధ్య చిన్నప్పటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్లు గతంలో తాము కలిసినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. 

కజిన్స్ బ్యాచ్ అంతా కూడా యవ్వనంలోకి అడుగుపెడతారు. అలాంటి పరిస్థితులలోనే 'మనూ'కి 'వీణ' అనే అమ్మాయితో పెళ్లి ఖాయమవుతుంది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోతూ ఉంటాయి. ఆ పెళ్లికి అతని కజిన్స్ అంతా హాజరవుతారు. 'మనూ' .. దియా మధ్య చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. వయసుకు వచ్చాక అది ప్రేమగా మారుతుంది. ఆ విషయం మిగతా కజిన్స్ కి కూడా తెలుసు. అయినా అనుకోని కారణాల వలన, వీణతో మనూకి పెళ్లి కుదురుతుంది.

మనూ పెళ్లికి ముందురోజు రాత్రి అతణ్ణి రహస్యంగా కలుస్తుంది దియా. ఆ రాత్రే తాము ఊరొదిలి    పారిపోవాలని అంటుంది. అందుకు అతను కూడా అంగీకరిస్తాడు. వాళ్లిద్దరూ 'త్రిశూల్' వెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవడానికి కజిన్స్ ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం వెళ్లిపోయిన ఆ ఇద్దరిలో, మనూ తిరిగి రావడం కజిన్స్ ను షాక్ కి గురిచేస్తుంది. మనూ ఎందుకు వెళ్లలేదు? దియా ఏమైపోయింది? పెళ్లి ఆమెది వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? అనేది కథ. 

సాధారణంగా ఫంక్షన్స్ కి వెళ్లడానికి పిల్లలు ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. ఆ వేడుకలలో అయినవాళ్లతో మరింత సన్నిహితంగా మసలుకుంటూ ఉంటారు. ఆటపాటలతో కూడిన ఆ పరిచయాన్ని వాళ్లు అంత తేలికగా మరిచిపోలేరు. అలా ఒక్కో ఫంక్షన్ కి వెళ్లినప్పుడల్లా వాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వెళుతుంది. వయసుతో పాటు అది ప్రేమగా మారుతుంది. అలాంటి కజిన్స్ చుట్టూ అల్లుకొన్న కథ ఇది.

దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది. ఆరుగురు కజిన్స్ 7 పెళ్లిళ్లలో కలుసుకుంటారు. ఒక్కో పెళ్లి వేడుక వాళ్ల జీవితంలో ఒక మలుపుకు కారణమవుతుంది .. ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోతుంది. పెళ్లి నేపథ్యంలో సందడిగా నడిచే సన్నివేశాలను డిజైన్ చేసుకున్న విధానం సరదాగా అనిపిస్తుంది. అలకలు .. అల్లరి పనులు .. సరదాలు .. గొడవలు ఆడియన్స్ ను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. 

ఇక కజిన్స్ అందరూ ఒక్కో ప్రదేశంలో పెరుగుతారు. అక్కడ వాళ్లు పెరిగిన తీరు .. అక్కడి లైఫ్ స్టైల్ .. వాళ్ల స్వభావాల మధ్య తేడా ఇవన్నీ కూడా దర్శకుడు ఆవిష్కరించిన పద్ధతి సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ముఖ్యంగా పల్లెటూరి పిల్ల దియా .. పట్నం పిల్లాడు మనూ మధ్య  చోటుచేసుకునే సన్నివేశాలు ప్రేక్షకులను తమతో పాటు పరిగెత్తిస్తాయి. లవ్ .. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ కు కనెక్ట్ చేస్తాయి. 

ఏడు పెళ్లి వేడుకలకి ఆరుగురు  కజిన్స్ తమ పేరెంట్స్ తో కలిసి హాజరవుతారు.. ఆ ఏడు పెళ్లిళ్లు ఈ ఆరుగురు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది కథ. పెళ్లి వేడుకలలో ప్రేమ ప్రయాణం అనేట్టుగా సాగే ఈ సిరీస్ నుంచి ప్రస్తుతం 4 ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దర్శకుడు ఈ సిరీస్ ను మొదలుపెట్టిన విధానం చూస్తేనే, స్క్రీన్ ప్లే బలంగానే ఉందనే విషయం అర్థమవుతోంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా బాగా చేశారు. ప్రవీణ్ బాలకృష్ణన్ అందించిన ఈ కథకు, ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ న్యాయం చేశాయని అనిపిస్తుంది.  
 
 నిర్మాణ విలువలతో పాటు, కథాకథనాలు .. కథకి తగిన లొకేషన్స్ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పాలి. మొదటి నాలుగు ఎపిసోడ్స్ లోనే చాలా కథను చెప్పేశారు. అందువలన ఈ సిరీస్ కథనం వేగంగా ఉండేలానే కనిపిస్తోంది. మిగతా 56 ఎపిసోడ్స్ లో కొత్త పాత్రలు .. ఆసక్తికరమైన మలుపులు పలకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ గానే చెప్పుకోవలసి ఉంటుంది. 

Movie Details

Movie Name: Cousins and Kalyanams

Release Date:

Cast: Krishna Vijayachandran,Manasvini, Siddharth, Nainitha Maria, Nanditha, Manya

Director: Niju Soman

Producer: Adithya - Sameer Khan- Anup Chandra

Music: Sudeep Palnad - Sanjith George

Banner: The Epic Company

Cousins and Kalyanams Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews