ఈ మధ్య కాలంలో కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే కథలకు మళ్లీ ఆదరణ పెరుగుతూ ఉండటం కనిపిస్తోంది. కేవలం వాదనలతో కాలక్షేపం చేయకుండా, ఈ కాలానికి తగినట్టుగా కంటెంట్ ను మారుస్తూ వెళుతున్న తీరు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక లీగల్ డ్రామాతో నేరుగా 'అమెజాన్ ప్రైమ్'కి వచ్చిన సినిమానే 'సిస్టమ్'. సోనాక్షి సిన్హా - జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అశ్వనీ అయ్యర్ దర్శకత్వం వహించారు.
ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన న్యాయవాదిగా రవి రాజ్ వంశ్ ( అశుతోష్ గోవారికర్)కి పేరు ఉంటుంది. ఆయన ఒక కేసు టేకప్ చేశాడంటే, అందులో ఆయన గెలవాల్సిదే. అందువల్లనే శ్రీమంతుల కేసులను మాత్రమే ఆయన వాదిస్తాడనే ఒక పేరు బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన కూతురే నేహా రాజ్ వంశ్ ( సోనాక్షి సిన్హా). ఆమె కూడా అదే కోర్టులో లాయర్ గా పనిచేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే పట్టుదలతో ఉంటుంది.
అదే కోర్టులో సారిక రావత్ (జ్యోతిక) స్టెనో గ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఓ ప్రమాదం కారణంగా ఆమె భర్త రెండు కాళ్లను కోల్పోతాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ కుటుంబ భారాన్ని పూర్తిగా మోస్తూ ఉంటుంది. కూతురు 'కుసుమ్' ను చదివిస్తూ ఉంటుంది. ఒకసారి సారిక రావత్ కి నేహా తన కారులో లిఫ్ట్ ఇస్తుంది. ఆ సమయంలో సారిక ఆలోచనా విధానం నేహాకి నచ్చుతుంది. ప్రతి కేసుకి 20 వేలు ఇస్తానని చెప్పి, సారిక సూచనలతో కేసులు గెలవడం మొదలుపెడుతుంది.
ఇనయా కొఠారి హత్య కేసు నేహా ముందుకు వస్తుంది. ఆ కేసులో నిందితుడు విక్రమ్ బజ్రాల్. అతను పెద్ద వ్యాపారీ .. నేహా తండ్రి రవి రాజ్ వంశ్ కి మంచి స్నేహితుడు. అందువలన విక్రమ్ బజ్రాల్ తరఫున ఆ కేసును వాదించడానికి అతను రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో తనకి వ్యతిరేకంగా వాదించే ప్రయత్నం మానుకోమని కూతురును హెచ్చరిస్తాడు. అయినా నేహా వినిపించుకోకుండా, సాక్ష్యాధారాల కోసం అన్వేషణ మొదలుపెడుతుంది.
కొంత కాలం క్రితం 'ట్విస్టెడ్ బార్'లో జరిగిన అగ్ని ప్రమాదానికీ, ఇనయా కొఠారి హత్య కేసుకు సంబంధం ఉందనే విషయం నేహా పసిగడుతుంది. ఆ బార్ లో ఏం జరిగింది? అందుకు కారకులు ఎవరు? ఇనయాను ఎవరు హత్య చేశారు? విక్రమ్ బజ్రాల్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఈ కేసు విషయంలో నేహాకి సారిక చేసే సూచనలు ఏంటి? అనేది మిగతా కథ.
ఈ కథ చాలా నిదానంగా మొదలవుతుంది. డబ్బు కోసం మాత్రమే వాదిస్తూ, తనకి తిరుగులేదని గర్వించే ఒక సీనియర్ న్యాయవాది. లాయర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్న అతని కూతురు. కోర్టులో ప్రతిరోజూ వాదనలు .. తీర్పులు వింటూ నాలెడ్జ్ పెంచుకున్న ఒక స్టెనో. ఈ మూడు పాత్రల చుట్టూనే దర్శకుడు కథను అల్లుకున్నాడు. నాలుగు గోడల మధ్యనే ఈ కథను ఎక్కువగా నడిపించాడు.
ఎప్పుడైతే నేహా - సారిక మధ్య పరిచయం జరిగిందో, తండ్రి మాటలను పట్టించుకుని నేహా ఇల్లొదిలి బయటికి వచ్చేసిందో అప్పటి నుంచి కథలో కాస్త కదలిక మొదలవుతుంది. విక్రమ్ బజ్రాల్ కి సంబంధించిన కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం వేగాన్ని పుంజుకుని, క్లైమాక్స్ ను రక్తి కట్టిస్తుంది.
ఢిల్లీ రద్దీ వాతావరణం .. అక్కడి విలాసవంతమైన జీవితాలు .. మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయనేది చూపించిన తీరు బాగుంది. సోనాక్షి సిన్హా .. జ్యోతిక .. అశుతోష్ గోవారికర్ నటన ఆకట్టుకుంటుంది. కథ ఓ మాదిరిదే అయినప్పటికీ, కథనం వైపు నుంచి కుతూహలాన్ని పెంచారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి.
చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని కొంతమంది నేరస్థులు తప్పించుకుంటున్నారు. డబ్బుకోసం ఆశపడే కొంతమంది న్యాయవాదులు అలాంటివారికి అండగా నిలబడుతున్నారు. తమకి న్యాయం జరగదనే ఆలోచనతో బాధితులు ఎలా మారుతున్నారు? నిజమనేది ఎప్పటికీ నిరూపణకు నిలుస్తుందనే నమ్మకాన్ని వాళ్లకి కలిగించేదెవరు? అనే సందేశం చుట్టూ తిరిగే కథ ఇది. కథ ఆరంభంలో కాస్త నిదానంగా కదిలినప్పటికీ, ఆ తరువాత కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది.
'సిస్టమ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
System Review
Movie Details
Movie Name: System
Release Date: 2026-05-22
Cast: Sonakshi Sinha, Jyothika, Ashutosh Gowariker, Nishanth Singh, Vijayant Kohli
Director: Ashwini Iyer Tiwari
Music: Karthik
Banner: -
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer