'మధువిధు' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

సాధారణంగా మలయాళం నుంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ జోనర్ పై మలయాళ మేకర్స్ మరింత పట్టు చూపుతుంటారు. అయితే ఈ వారం మలయాళం నుంచి ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమానే 'మధువిధు'. విష్ణు అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. షరాఫుద్దీన్ - కల్యాణి పణిక్కర్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ రోజు ( మే 22వ తేదీ) నుంచి 'సోనీలివ్'లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కేరళ ప్రాంతంలో .. ఎర్నాకులం పరిధిలో 'కొచ్చాంబళం' అనే ఒక ఊళ్లో రాజ్ కుమార్ ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. తన తండ్రి .. తమ్ముడు అంబరీష్ .. కొడుకులు అమృత రాజ్ (షరాఫుద్దీన్)
విమల్ రాజ్ (అమల్ జోస్) కలిసి నివసిస్తూ ఉంటారు. ఆడదిక్కు లేని కుటుంబాన్ని అతికష్టం మీద నెట్టుకుంటూ వస్తుంటారు. అమృత్ రాజ్ ఒక కేఫ్ నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముడు విమల్ రాజు యూ ట్యూబర్ గా బిజీ. ఇక వాళ్ల బాబాయ్ చేసేది కేబుల్ టీవీ బిజినెస్. 

అదే ఊళ్లో మార్కోస్ (శశి కుమార్)కి స్నేహ (కల్యాణి పణిక్కర్) సోఫియా (అనుశ్రేయ రాజన్) అనే కూతుళ్లు ఉంటారు. మార్కోస్ చెల్లెలు మెర్సీ (శ్రీ జయ నాయర్) ఆమె కూతురు 'మిలి' కూడా అతని దగ్గరే ఉంటూ ఉంటారు. అందుకు కారణం మెర్సీని ఆమె భర్త మోసం చేసి వెళ్లిపోవడమే. స్నేహనీ .. ఆమె చెల్లెలు సోఫీయాను, జోయెల్ - టామ్ అనే అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేయాలని మార్కోస్ నిర్ణయించుకుంటాడు. అందుకు అందరూ ఒప్పుకుంటారు కూడా.

రాజ్ కుమార్ భార్య సరోజిని చనిపోయిన దగ్గర నుంచి ఆ ఇంట్లోకి ఆడమనిషి అంటూ కాలు పెట్టదు. రాజ్ కుమార్ తమ్ముడికి గానీ .. ఆయన ఇద్దరు కొడుకులకు గాని సంబంధాలు కుదరవు. అందుకు కారణం ఆ ఇంటికి నాగదోషం ఉందనే ప్రచారం జరగడమే. అందువలన రాజ్ కుమార్ తమ్ముడు  .. ఆయన కొడుకులు పెళ్లిపై ఆశలు వదులుకుంటారు. వంతుల వారీగా వంట చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.    

ఈ నేపథ్యంలోనే అమృత్ రాజ్ - స్నేహ ఇద్దరూ ప్రేమలో పడతారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని గురించి ఇరు కుటుంబాలవారు మాట్లాడుకుంటారు. అమృత రాజ్.. స్నేహ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా, స్నేహ మేనత్త మెర్సినీ, అమృత్ రాజ్ తండ్రి రాజ్ కుమార్ రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటనతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.

సాధారణంగా ఆడదిక్కులేని ఇంటికి పిల్లను ఇవ్వకపోవడమనే ఒక ఆలోచన పూర్వీకుల నుంచి కనిపిస్తుంది. ఇక ఏదైనా కుటుంబానికి దోషం ఉందనే ప్రచారం జరిగితే కూడా, ఆ ఇంట్లో వాళ్లకి పెళ్లి కావడం కష్టమే. అలాంటి ఒక సమస్యను ఆ కుటుంబ సభ్యులు ఎలా అధిగమిస్తారు? వాళ్ల జీవితాలను పెళ్లి అనేది ఎలా ప్రభావితం చేస్తుంది? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథను అల్లుతూ వెళ్లారు.   

ఇది ఒక విలేజ్ చుట్టూ .. రెండు కుటుంబాల చుట్టూ తిరిగే కథ. ఒక ఇంటికి రాజ్ కుమార్ యజమాని. అతను తన తమ్ముడికీ .. ఇద్దరు కొడుకులకు పెళ్లి చేయవలసి ఉంటుంది. మరొక ఇంటికి యజమాని మార్కోస్. తన ఇద్దరి కూతుళ్లకు, ఒక మేనకోడలికి పెళ్లి చేయవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. 'పెళ్లి' అనేది ఈ రెండు కుటుంబాలలో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందనేది ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది.  

నాగదోషం ఉందని రాజ్ కుమార్ ఇంటికి ఎవరూ పిల్లనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి చెందిన మగాళ్లంతా ఒక్కొక్కరూ లవ్ లో పడిన తీరును డిజైన్ చేసుకున్న విధానం చాలా సరదాగా అనిపిస్తుంది. అలకలు .. బుజ్జగింపులు .. వేడుకలు .. వేదనలు .. ఇలా అన్నింటినీ కలుపుకుంటూ ఈ కథను ముందుకు తీసుకెళ్లడం మెప్పిస్తుంది. ముఖ్యంగా పట్టె మంచం చేయించడం .. వద్దనడం, తరచూ ఒకే దగ్గర కేబుల్ వైర్ తెగిపోవడం వంటి సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.

దర్శకుడు కథాకథనాలను తయారు చేసుకున్న తీరు బాగుంది. అలాగే పాత్రలు .. స్వరూప స్వభావాలను ఆవిష్కరించిన విధానం సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది. విశ్వజిత్ ఫొటోగ్రఫీ .. హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం .. క్రిస్టీ సెబాస్టియన్ ఎడిటింగ్ ఫరవాలేదు.

 స్త్రీలైనా .. పురుషులైనా పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటూ పొందే స్వేచ్ఛ వేరు. పెళ్లి చేసుకుని పొందే సంతోషం వేరు. పెళ్లి అనేది ఒక పంజరం లాంటిదని చాలామంది భావిస్తుంటారు. కానీ పెళ్లి అనేది ఒక అందమైన బంధం అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. బోర్ కొట్టకుండా సింపుల్ కంటెంట్ తో సరదాగా సాగిపోయే సినిమా ఇది. 

Movie Details

Movie Name: Madhuvidhu

Release Date:

Cast: Sharaf Udheen, kalyani Paniker, jagadish, Saikumar,Azees Nedumangad

Director: Vishnu Aravind

Producer: Ajith Vinayaka

Music: Hesham Abdul Wahab

Banner: Ajith Vinayaka Films

Madhuvidhu Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews