ప్రియదర్శి కథానాయకుడిగా విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'సుయోధన'. సాయికుమార్ .. ప్రేమ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహించాడు. మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
వరుణ్ (ప్రియదర్శి) హైదరాబాదులో సినిమాలకి సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంటాడు. అతనికంటూ ఒక సొంత స్టూడియో ఉంటుంది. చిన్నప్పటి నుంచి వరుణ్ ని ఒక సమస్య వేధిస్తుంటుంది. 'సుయోధన' అంటూ ఎవరో తనని పిలుస్తున్నట్టుగా అతనికి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందనేది తెలుసుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
వరుణ్ తండ్రి ప్రకాశ్ (సాయికుమార్) రాజకీయనాయకుడిగా బిజీగా ఉంటాడు. భార్య రాధ (రాజశ్రీ నాయర్) అతనికి రాజకీయాలలో సూచనలు .. సలహాలు ఇస్తుంటుంది. ఒక రోజున వరుణ్ కి 'సంహిత' తారసపడుతుంది. డెమో ఫిల్మ్ చేయాలనుకున్న సంహిత, అతని హెల్ప్ కోరుతుంది. అప్పటి నుంచి వాళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. చాలా కాలం క్రితం 'వరలక్ష్మి' అనే ఒక నర్స్, మహతి అనే ఒక యువతిని గురించి రాసుకున్న 'డైరీ' ఆధారంగా తాను డెమో ఫిల్మ్ షూట్ చేస్తున్నట్టు వరుణ్ తో సంహిత చెబుతుంది.
మహతి (ప్రేమ) అనే ఒక యువతి తన భర్త చేతిలో మరణిస్తూ, చివరి నిమిషంలో తన బిడ్డను కాపాడుతుంది. ఆమె త్యాగం వరుణ్ మనసును కదిలించివేస్తుంది. మహతి ఎవరు? భర్త చేతిలో ఆమె ఎందుకు చనిపోయింది? అనే విషయాలు తెలుసుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. అందుకోసం రంగంలోకి దిగిన వరుణ్ పై, కొంతమంది ఆగంతకులు ఎటాక్ చేస్తారు. మహతి ఎవరు? ఆమె కథతో వరుణ్ కి గల సంబంధం ఏమిటి? అతనిపై దాడి చేయించింది ఎవరు? అతనికి తెలిసే చేదు నిజాలేమిటి? అనేది మిగతా కథ.
జీవితంలో కొన్ని అంశాలు ఆసక్తికరంగా .. మనసును కదిలించేలా అనిపిస్తాయి. అలాంటి సంఘటనలను గురించిన నిజానిజాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా కలుగుతూ ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు తెలిసే నిజాలు నివ్వెరపోయేలా చేస్తుంటాయి. అలాంటి ఒక పరిస్థితి ఈ సినిమాలో హీరోకి ఎదురైతే, అప్పుడతను ఏం చేశాడనే అంశం చుట్టూ ఈ కథ అల్లుకున్నారు.
ఒక వైపు నుంచి సిన్సియర్ గా హీరో అన్వేషణ సాగుతూ ఉంటుంది. మరో వైపు నుంచి అతని మార్గానికి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. రాజకీయాలు .. రౌడీ గ్యాంగులు .. పోలీస్ అధికారులు అతని ట్రాక్ ను టచ్ చేస్తూ ఉంటారు. అడపాదడపా డాక్టర్ల హడావిడి కూడా ఉండనే ఉంటుంది. హీరో వాటన్నింటినీ దాటుకుంటూ వెళుతున్న తీరును ఉత్కంఠ భరితంగా ఆవిష్కరించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు.
'సుయోధన' అనే టైటిల్ వినగానే, ఇందులో సుయోధనుడిగా సాయికుమార్ ఏకపాత్రాభినయం .. భారీ డైలాగులు ఉంటాయని ప్రేక్షకులు అనుకోవడం సహజం. సరిగ్గా అలాంటి ఒక స్టేజ్ షోతోనే ఈ సినిమాను మొదలుపెట్టారు. సుయోధనుడి పాత్రతో ఈ కథకి సంబంధం ఉండటం వలన, ఆ టైటిల్ ను సెట్ చేసినట్టుగా మనకి అర్థమైపోతుంది. అర్థమయ్యేలా చెప్పారు కూడా.
ఈ కథలో సస్పెన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ట్విస్టులు పలకరిస్తూ వెళుతుంటాయి. లవ్ ట్రాక్ కూడా ఉంది. కానీ ఎందుకనో దర్శకుడు ఆ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. అందువలన హీరోయిన్ ఉందా అంటే ఉంది అంతే అనేట్టుగానే అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపించడం జరుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ లో నాటకీయ పరిణామాలు మామూలే.
ఈ కథలో హీరో తనకి కావలసిన సమాచారం కోసం పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ముందుకు వెళుతుంటాడు. అయితే ముందు జరగబోయే కథను అప్పటికే గెస్ చేసిన ప్రేక్షకులు, అచ్చు అలాగే జరుగుతూ ఉండటంతో తాపీగా అలా కూర్చుండిపోయి చూస్తుంటారు అంతే. అసలు ఏం జరిగి ఉంటుందనేది తెరపై హీరోకంటే ముందుగానే ఆడియన్స్ పసిగట్టగలిగేలా ఉండటమే ఈ కథాకథనాలలోని ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.
ప్రియదర్శి తన మార్క్ నటన కనబరిచాడు. హీరోయిన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సాయికుమార్ .. ప్రేమ .. రాజశ్రీ నాయర్ .. దేవీప్రసాద్ .. ఇలా మంచి సీనియర్ ఆర్టిస్టులే ఉన్నారు. ఎవరికి వారు పాత్ర పరిధిలో మెప్పిస్తూనే వెళ్లారు. కార్తీక్ కొప్పర ఫొటోగ్రఫీ .. జయ్ క్రిష్ నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే.
'సుయోధన' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Suyodhana Review
Movie Details
Movie Name: Suyodhana
Release Date: 2026-04-17
Cast: Priyadrshi, Drishika Chander Sai Kumar, Prema, Rajasri Nair, Devi Prasad
Director: YS Madhav Reddy
Music: Jay Krish
Banner: Prajwal Line Creation
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer