'సాంప్రదాయిని .. సుప్పిని .. సుద్దపూసని' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' సినిమా తరువాత, 'సాంప్రదాయిని .. సుప్పిని .. సుద్దపూసని' అనే పాట లాంటి మాట ఎంత పాప్యులర్ అయిందనేది అందరికీ తెలిసిందే. అందువల్లనే అదే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. శివాజీ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకి, సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. చాలా కాలం తరువాత కథానాయిక పాత్రలో 'లయ' నటించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

 'హార్సిలీ హిల్స్' గ్రామంలో శ్రీరామ్ (శివాజీ) ఆయన భార్య ఉత్తర (లయ) కొడుకు నితిన్ (రోషన్) నివసిస్తూ ఉంటారు. శ్రీరామ్ గ్రామపంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉంటాడు. శ్రీరామ్ నిజాయితీపరుడు .. ముక్కుసూటి మనిషి. తన కళ్లముందు అన్యాయం జరిగితే నిలదీసే తత్వం ఆయనది. ఆ కారణంగానే ఎమ్మెల్యే తిమ్మప్ప (శరత్ లోహితస్య)తో .. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ (ప్రిన్స్)తో శ్రీరామ్ కి గొడవ జరుగుతుంది.ఈ ఇద్దరూ శ్రీరామ్ పట్ల గుర్రుగా ఉంటారు.

  శ్రీరామ్ భార్య ఉత్తరపై కన్నేసిన విక్రమ్, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో వెళతాడు. శ్రీరామ్ కొడుకైన నితిన్ గడుగ్గాయి కావడంతో, విక్రమ్ నుంచి సరదాగా 'గన్' తీసుకుని, తెలియక అతనిని షూట్ చేస్తాడు. దాంతో అక్కడికక్కడే విక్రమ్ చనిపోతాడు. అదే సమయంలో వచ్చిన శ్రీరామ్, ఆ నేరాన్ని తనపై వేసుకుని జైలుకు వెళ్లడానికి సిద్ధమవుతాడు. అయితే అందుకు ఉత్తర ఒప్పుకోదు. శవాన్ని మాయం చేసి ఆ గండం నుంచి బయటపడదామని చెబుతుంది. ఆ విషయంలో అతనిని ఒప్పిస్తుంది. 

విక్రమ్ డెడ్ బాడీని .. పక్కింటి ప్రసాద్ కారులో రహస్యంగా తీసుకుని వెళ్లి ఎక్కడైనా మాయం చేసి రావాలని శ్రీరామ్ భావిస్తాడు. శవాన్ని కారు డిక్కీలో పెట్టేసి, తన భార్య బిడ్డలతో కలిసి బయల్దేరతాడు. మంత్రి పురుషోత్తమ రెడ్డికి ఎమ్మెల్యే తిమ్మప్ప పంపించిన పెద్దమొత్తంలోని డబ్బు,  ఆ కారులో ఉందనే విషయం శ్రీరామ్ కి తెలియదు. ఆ కారు కోసం తిమ్మప్ప అనుచరులు వెతకడం మొదలుపెడతారు. మరో వైపున హఠాత్తుగా అదృశ్యమైపోయిన విక్రమ్ కోసం పోలీసులు వెదుకుతుంటారు. ఈ గండాల నుంచి శ్రీరామ్ తన ఫ్యామిలీని కాపాడుకోగలుగుతాడా? అనేది కథ.

ఈ కథ అంతా కూడా శ్రీరామ్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఫ్యాలీ చుట్టూ తిరుగుతుంది. నిజాయితీ  పరుడైన శ్రీరామ్ .. అతనికి భార్యగా కాస్త అమాయకత్వం కలిగిన ఉత్తర .. ఇక రీల్స్ ..వ్యూస్ అంటూ ఎప్పటికప్పుడు సెన్సేషన్ ను వెతుక్కునే గడుగ్గాయి కొడుకు నితిన్. ఈ కథలో ఈ మూడు పాత్రలే కీలకం. ఈ మూడు పాత్రల స్వభావాలే ఈ కథ అనేక మలుపులు తీసుకోవడానికి కారణమవుతూ ఉంటాయి. 

ఇక స్త్రీ వ్యామోహంతో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ .. లంచాలుగా ముట్టజెప్పడం కోసం రాజకీయ నాయకుల మధ్య తరలించబడే డబ్బు అనే అంశాలను దర్శకుడు వేరు వేరు ట్రాకులుగా వేస్తూ వెళ్లిన తీరు కథలో మరింత ఆసక్తిని పెంచడానికి కారణమవుతుంది. అటు పోలీస్ వారికీ .. ఇటు రాజకీయ నాయకులకు హీరో టార్గెట్ అవుతాడు. ఈ మూడు ట్రాకులు కలిసి పరిగెత్తడం మొదలైన దగ్గర నుంచి ఆడియన్స్ లో కుతూహలం మరింత పెరగడం మొదలవుతుంది. 

పోలీస్ ఆఫీసర్ శవాన్ని మాయం చేయడానికి శ్రీరామ్ పడే తంటాలు, ఆ పోలీస్ ఆఫీసర్ ఆచూకీ తెలుసుకోవడం కోసం ముమ్మరంగా గాలించే పోలీసులు .. డబ్బు కోసం రాజకీయనాయకుల అనుచరుల వేట .. నాటకీయ పరిణామాలతో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ అలా జరగకుండా .. నిదానంగా సాగే కథాకథనాలతో ఈ కంటెంట్ నిరాశపరుస్తుంది. కథ క్లైమాక్స్ కి చేరుకుంటూ ఉండగా, వెంటవెంటనే కొన్ని ట్విస్టులు పడేశారు. అవి కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అయితే అప్పటివరకూ జరిగిన సాగతీత ప్రభావమే ఆడియన్స్ పై ఎక్కువగా కనిపిస్తుంది.  

నిజాయితీ పరుడైన ఒక గ్రామపంచాయతి కార్యదర్శి, అనుకోకుండా జరిగిన ఒక హత్యా నేరం నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? అనే ఒక పాయింట్ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అయితే అందుకు సంబంధించి అల్లుకున్న సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కామెడీ వైపు నుంచి కూడా కనెక్ట్ కాలేకపోయాయి. శరత్ లోహితస్య విలనిజంలో అంతగా పవర్ కనిపించదు. అలీ .. చమ్మక్ చంద్ర .. పృథ్వీ .. రఘుబాబు పాత్రల ప్రభావం కూడా పెద్దగా కనిపించదు. 

శివాజీ .. లయ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. గడుగ్గాయిగా రోహన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రిన్స్ తన మార్క్ చూపించాడు. రిత్విక్ రెడ్డి ఫొటోగ్రఫీ .. రంజిన్ రాజ్ నేపథ్య సంగీతం .. బాలు మనోజ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.కొన్ని సన్నివేశాలు కుతూహలాన్ని రేకెత్తించేవిగా ఉన్నప్పటికీ, సాగదీస్తూ వెళ్లిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటం ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు ఈ తరహా కథలు గతంలో వచ్చినందు వలన కొత్తగా ఏమీ అనిపించదు. రొటీన్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోయిన ఒక కంటెంట్ గానే ఇది మనకి కనిపిస్తుంది.   

Movie Details

Movie Name: Sampradayini Suppini Suddapoosani

Release Date:

Cast: Shivaji, Laya, Rohan, Sarath Lohitasya, Ali, Prithvi, Prince

Director: Sudhir Sriram

Producer: Shivaji

Music: Ranjin Raj

Banner: Sri Shivaji Productions

Sampradayini Suppini Suddapoosani Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews