' ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ

 
మలయాళంలో విడుదలై విజయం సాధించిన 'జయ జయ జయ జయ హే'కి రీమేక్‌గా రూపొందిన చిత్రం ' ఓం శాంతి శాంతి శాంతిః'. ఏఆర్‌. సజీవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఓటీటీలో మలయాళ మాతృకను అందరూ చూసేసిన తరువాత కూడా తెలుగులో ఈ సినిమాను రీమేక్‌ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక ఈ రీమేక్‌ సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? తెలుగు మేకర్స్ ఈ సినిమా విషయంలో చూపించిన కొత్తదనం ఏమిటి? అనేది సమీక్షలో తెలుసుకుందాం.. 

పెళ్లికి ముందు.. పెళ్లి తరువాత కూడా అమ్మాయిలకు, ఆడపిల్లలకు స్వేచ్ఛ, సమానత్వం,స్వాతంత్యం ఉండాలని కోరుకునే అమ్మాయి ప్రశాంతి (ఈషా రెబ్బా) అయితే చిన్నప్పటి నుంచి తండ్రి, మేనమామ, అన్నయ్య, అమ్మల సంరక్షణలో పెరిగి, తను అనుకున్న చదువును చదవలేక, కావాలిసిన దుస్తులు ధరించలేక పోతుంది. కనీం పెళ్లయ్యాక సంతోషంగా ఉండాలని, తను అనుకున్నట్లుగా జీవితాన్ని గడపాలని అనుకుంటే భర్త ఓంకార్‌ నాయుడు(తరుణ్‌ భాస్కర్‌) కూడా  ఆమెపై అంక్షలు విధించడంతో పాటు, భార్య తన మాటే వినాలని, భార్య అంటే ఇంటికే పరిమిత కావాలని ఆయన భావించడంతో ఆమెకు జీవితంపై విసుగొస్తుంది. అంతే కాదు భర్త చేత రోజు చెంపదెబ్బలు తింటూ ఉండటం ఇష్టం లేక ప్రశాంతి భర్త ఓంకార్‌ను ఎదురిస్తుంది. ఎదురించడంతో పాటు ప్రశాంతి దగ్గరికొస్తేనే వణుకు వచ్చేలా ఆమె అతనిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పుడు భర్త ఓంకార్‌ నాయుడు ఏం చేశాడు? వీళ్లిద్దరి కాపురం ఎలా సాగింది? ఇద్దరు కలిసి ఉంటారా? విడిపోతారా? చివరికి జరిగిందేమిటి అనేది మిగతా కథ. 

ఓటీటీ రాకతో ఇతర భాషల నుంచి దాదాపు రీమేక్‌లు చేయడం ఆపేశారు మన నిర్మాతలు. ఓటీటీ వల్ల భాష హద్దులు చెరిగిపోవడమే అందుకు కారణం. అయితే ఈ చిత్ర దర్శక, నిర్మాతలు మాత్రం మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడం నిజంగా సాహసమే అనిపించింది. అయితే మలయాళ మాతృకలో ఉన్న సహజత్వం, ఆసక్తి ఈ రీమేక్‌లో తీసుకరాలేకపోయారు. ఇలాంటి అందరికి తెలిసిన కథను మళ్లీ చెప్పాలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా కథ గమనం కొత్తగా ఉండాలి, సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉండాలి. 

ఈ విషయంలో దర్శకుడు రచనాపరంగా పెద్దగా వర్క్‌ చేయలేదనిపించింది. ఒరిజినల్ సినిమాలోని ఫ్రెష్‌నెస్‌, హ్యుమర్‌, సెటైరికల్‌ ఫన్‌ ఈ సినిమాలో పూర్తిగా లోపించింది. తొలిభాగం సరదాగా ఫర్వాలేదనిపించే స్థాయిలో అనిపించినా, సెకండాఫ్‌ మాత్రం చాలా భారంగా, బరువుగా ఉందనే భావన కనిపిస్తుంది. మాతృకలో ఉన్న సోల్‌ మిస్‌ చేశారని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంతకు ముందే మలయాళ సినిమా చూసిన వాళ్లకు మాత్రం ఇది టీవీ సీరియల్‌గా అనిపిస్తుంది. మాతృకలో ప్రతి క్యారెక్టర్‌ ఎంతో సహజంగా బిహేవ్‌ చేసినట్లుగా అనిపిస్తాయి. తెలుగులోకి వచ్చే సరికి ఆ పాత్రలు కృతిమంగా కనిపిస్తాయి.

సినిమా మొదటి సన్నివేశం నుంచి ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ఓ రీమేక్‌ను తెరకెక్కించేటప్పుడు పెట్టాల్సిన మినిమమ్‌ ఎఫర్ట్‌ కూడా పెట్టకపోవడం వల్ల సినిమా ఆద్యంతం ఎక్కడా కూడా ఆసక్తిగా అనిపించదు. ఒరిజినల్‌ వెర్షన్‌లో నటించిన హీరో, హీరోయిన్‌లు ఆ పాత్రలకు సరిగ్గా కుదిరారు. కానీ తెలుగులో మాత్రం తరుణ్‌, ఈషాల పాత్రలు చూస్తే ఆలోపం ఉందేమో అనిపించింది. బ్రహ్మజీ కామెడీ కూడా పండలేదు. కథ మొత్తం చిన్నలైన్‌ చుట్టే తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వినోదానికి పెద్ద పీట వేస్తే కథనం నత్తనడకన సాగుతున్న భావన కలగదు. 

అందుకే  ఈ సినిమాలో వచ్చిన సన్నివేశాలు మళ్లీ మళ్లీ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఒరిజినల్‌ వెర్షన్‌ చూడని వాళ్లకు మాత్రం కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించినా, మలయాళంలో మాతృక చూసిన వాళ్లకు ఈ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ యాడ్‌ చేసి ఉంటే భార్య భర్తల అనుబంధం గురించి లోతుగా చర్చించే సన్నివేశాలు ఉన్నట్లయితే ప్యామిలీ ఆడియన్స్‌ హృదయాలకు హత్తుకునేవి.

ఓంకార్‌ నాయుడుగా తరుణ్‌ భాస్కర్‌ చాలా హోమ్‌ వర్క్‌ చేసి నటించనట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ నేపథ్యానికి చెందిన ఈ దర్శక నటుడు గోదావరి యాసలో డైలాగులు అనర్గళంగానే చెప్పినా. ఎందుకో అది ఆర్గానిక్‌లా అనిపించదు. అయితే నటుడిగా మాత్రం మెప్పించాడు. హీరోయిన్‌ చేతిలో దెబ్బలు తిని,వినోదాన్నిపండించే సన్నివేశాలు, నెగెటివ్‌ షేడ్స్‌తో సంభాషణలు చెప్పే సీన్స్‌లో తరుణ్‌ నటన ప్రతిభ తెలుస్తుంది. ఒరిజినల్‌ వెర్షన్‌లో బాసిల్‌ జోసెఫ్‌ అప్పీరియన్స్‌కు, ఈ రీమేక్‌లో ఓంకార్‌ నాయుడు కనిపించిన విధానానికి తేడా ఉంది.  

ఈషా రెబ్బాకు చాలా రోజుల తరువాత లభించిన మంచి పాత్ర ఇది. యాక్షన్‌ సన్నివేశాల్లో ఈషా బాగా చేసింది. సెకండాఫ్‌లో భర్తను ఎదిరించి, తన కాళ్ల మీద తాను నిలబడాలని తపన పడే ఆదర్శ మహిళగా ఆమె ఎదిగిన విధానం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటాయి.  కెమెరామెన్ దీపక్‌ విజువల్స్‌ బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్‌ చిన్నప్పటి సన్నివేశాల్లో బ్రౌన్‌ టింట్‌తో డిఫరెన్స్‌ తెలిసే విధంగా చేశాడు. జయ్ క్రిష్ సంగీతం ఆహ్లాదంగా ఉంది. కథనంలో వేగం పెంచడంలో ఆయన నేపథ్యం సంగీతం హెల్ప్‌ అయ్యింది.  ట్యూన్స్‌ డామినేషన్‌ లేకుండా పాటల్లో సాహిత్యం కూడా వినిపించింది. 

తెలిసిన కథను మరింత ఆసక్తికరంగా వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తే అలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఈ సినిమాలో రీమేక్‌ను రీమేక్‌గా ఆ చిత్రంలోని సహజత్వాన్ని ఆత్మను మిస్‌ అవ్వకుండా తీసినా ఆడియన్సకు ఆసక్తిగా అనిపించేంది. కానీ ' 'ఓం శాంతి శాంతి శాంతిః' విషయంలో ఆ ప్రయత్న లోపం కనిపించింది.అయితే ఒరిజినల్‌ వెర్షన్‌ చూడని వాళ్లకు మాత్రం ఈ సినిమా కొంత మేరకు సంతృప్తి పరుస్తుంది. కానీ పూర్తి స్థాయి సంతృప్తి, శాంతి మాత్రం కలగదు. 

Movie Details

Movie Name: Om Shanti Shanti Shantihi

Release Date:

Cast: Tharun Bhascker, Esha Rebba, Bramhanandham, Brahmaji, Surabhi Prabhavathi, Goparaju Vijay, Sivannarayana (Amrutham Appaji), Bindu Chandramouli, Dheeraj Aathreya, Anshvi.

Director: A R Sajeev

Producer: Srujan Yarabolu, Aditya Pittie, Vivek Krishnani, Anup Chandrasekaran, Sadhik Shaik, and Naveen Sanivarapu

Music: Jay Krish

Banner: S Originals, Movie Verse Studios

Om Shanti Shanti Shantihi Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews