'ముఖ్య గమనిక' (ఆహా) మూవీ రివ్యూ!

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'ముఖ్య గమనిక'
  • క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమా 
  • కథానాయకుడిగా విరాన్ పరిచయం 
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  • ఓ మాదిరిగా అనిపించే కంటెంట్ 

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఓటీటీలలో ఈ జోనర్ కి సంబంధించిన కనెక్ట్ ను ఎక్కువగా చూస్తున్నారు. అలా 'ఆహా' వైపు నుంచి చూసుకుంటే. ఇదే జోనర్ కి చెందిన 'ముఖ్య గమనిక' అందుబాటులో ఉంది. అల్లు అర్జున్ బంధువైన విరాన్ ముత్తం శెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. రాజశేఖర్ - సాయికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి, వేణు మురళీధర్ దర్శకత్వం వహించాడు.

కథ: వీరూ (విరాన్) పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. సంగారెడ్డి జిల్లా - సదాశివ పేట్ లో పోస్టింగ్. జాయినింగ్ ఆర్డర్ తీసుకుని అతను పోలీస్ స్టేషన్ కి బయల్దేరతాడు. అదే పోలీస్ స్టేషన్లో అతని తండ్రి రామచంద్ర గతంలో ఎస్. ఐ. గా పనిస్తాడు. ఒక రోజున అతను దారుణంగా హత్యకి గురవుతాడు. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారనేది ఇప్పటికీ తేలని ఒక మిస్టరీ. అప్పట్లో రామచంద్ర అంటే ఏ మాత్రం పడని రుద్ర, ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో సీఐగా ఉంటాడు.

డ్యూటీలో చేరిన మొదటి రోజు నుంచే, విరాట్ ను 'రుద్ర' టార్చర్ చేయడం మొదలుపెడతాడు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించిన కేస్ ఫైల్ కనిపించకపోవడంతో 'రుద్ర'పై తొలిసారిగా విరాట్ కి అనుమానం వస్తుంది. తన తండ్రి హత్యకి గురైన రోజునే, అదే పోలీస్ స్టేషన్ పరిధిలో పురుషోత్తం అనే వ్యక్తి అదృశ్యమవుతాడు. తన తండ్రి హత్యకీ .. పురుషోత్తం అదృశ్యానికి వెనుక ఏదైనా సంబంధం ఉందేమోననే సందేహం కలుగుతుంది. 

దాంతో ఆయన నేరుగా పురుషోత్తం భార్య 'అపూర్వ'ను కలుసుకుంటాడు. పురుషోత్తం కనిపించకుండా పోవడానికి ముందు ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు అపూర్వ ఏం చెబుతుంది? పురుషోత్తం కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? వీరూ అనుమానించినట్టుగానే తన తండ్రి హత్యకీ, పురుషోత్తం అదృశ్యానికి మధ్య సంబంధం ఉంటుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: సమాజంలో ఒక వైపున ఎంతో వేగంగా టెక్నాలజీ పెరుగుతూ పోతోంది. సోషల్ మీడియా చాలామందిని చాలా రకాలుగా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మరో వైపున గ్రామాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మూఢనమ్మకాలు బలంగానే పాతుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ అంశాలను కలుపుకుంటూ దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఇది.

 తన తండ్రిని హత్య చేసినది ఎవరో తెలుసుకోవడానికి హీరో రంగంలోకి దిగడంతో ఈ కథ మొదలవుతుంది. హీరోని 'దియా' అనే యువతి ప్రేమిస్తున్నప్పటికీ, అతను తన పూర్తి ఫోకస్ తండ్రి హత్యకేసుపైనే పెడతాడు. ఆ తరువాత కథ సీఐ రుద్ర శాడిజాన్ని .. మూఢ నమ్మకాలను .. సోషల్ మీడియా పరిచయాలను టచ్ చేస్తూ వెళుతుంది. అసలు ఏం జరిగి ఉంటుందనే ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తూ కథ ముందుకు వెళుతుంది. 

 ఈ కథలో తన తండ్రి హత్య వెనుక ఎవరన్నది తెలుసుకోవడానికీ, అలాగే తన తండ్రి హత్యతో ముడిపడి ఉంటుందని భావించిన ఒక కిడ్నాప్ కేసును హీరో ఒకేసారి పరిశోధించడం మొదలెడతాడు. అయితే హత్య కేసు పక్కకి వెళ్లిపోయి, కిడ్నాప్ స్టోరి ఎక్కువ నిడివిని ఆక్రమించేసింది. హీరో - హీరోయిన్ పాత్రలు కూడా పక్కకి వెళ్లిపోయి, వేరే పాత్రలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఇదే ఈ కథలోని ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.

పనితీరు
: ఇంకా అంతరించిపోని మూఢనమ్మకాలు, జీవితాలపై సోషల్ మీడియా చూపుతున్న ప్రభావం అనే రెండు అంశాలను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను రూపొందించాడు. అయితే దర్శకుడు చాలా నిడివిని ఫ్లాష్ బ్యాక్ కి వదిలేయడం వలన, హీరో వైపు నుంచి వేసిన ట్రాక్ బలహీనపడినట్టుగా అనిపిస్తుంది. ఉపకథనే .. అసలు కథగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. నటీనటులు అందరూ పాత్రకి తగిన స్థాయిలో నటించారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: ఓ మాదిరి బడ్జెట్ లో .. సింపుల్ కంటెంట్ తోనే తెరకెక్కిన సినిమా ఇది. కథాకథనాల పరంగా కొత్తగా కనిపించకపోయినా, ట్రీట్మెంట్ పరంగా కాస్త బెటర్ గానే అనిపిస్తుంది. ఓ మాదిరి సినిమాగానే చెప్పుకోవచ్చు.

Movie Details

Movie Name: Mukhya Gamanika

Release Date: 2025-12-16

Cast: Viran, Lavanya, Aaryan Ippilli, AR Basha, Hariprasad

Director: Venu Muralidhar

Producer: Rajasekhar - Sai Krishna

Music: Kiran venna

Banner: Shvin Productions

Review By: Peddinti

Mukhya Gamanika Rating: 1.75 out of 5

Trailer

More Movie Reviews