తమిళంలో రూపొందిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు 'ఆహా' ఓటీటీ తెరపైకి వచ్చింది. ఆ సినిమా పేరే 'అధరన్'. ప్రజైన్ పద్మనాభన్ .. ఇవానా వరుణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. సాంబశివమ్ నిర్మించిన ఈ సినిమాకి, సంతోష్ రావణన్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా రీసెంటుగా 'ఆహా'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కార్తీక (ఇవానా వరుణ్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి 'శంకర్' బాగా డబ్బు .. పేరు ఉన్న ఒక బిల్డర్. రాజకీయనాయకుల అండదండలున్న ఫ్యామిలీ. కార్తీకను శంకర్ ఎంతో గారాబంగా పెంచుతాడు. ఆమెకి ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కార్తీకకి అతను ఎంతో స్వేచ్ఛను ఇస్తాడు. ఆమెకి శ్రీమంతుడైన వరుడిని తీసుకురావాలని అనుకుంటాడు. అయితే ఆటో డ్రైవర్ 'ఆదిత్య'తో ఆమె ప్రేమలో పడిందని తెలిసి అతను షాక్ అవుతాడు. కార్తీకను మందలించినా ప్రయోజనం లేకుండా పోతుంది.
తన తండ్రికి కులపిచ్చి ఎక్కువనీ, అందువలన ఆదిత్యతో తన ప్రేమకీ .. పెళ్లికి ఆయన ఎంతమాత్రం ఒప్పుకోడనే నిజం కార్తీకకి తెలుసు. అయినా ఆమె ఆదిత్యతో కలిసి తిరుగుతూనే ఉంటుంది. అయితే ఓ రోజున ఊహించని విధంగా 'ఆదిత్య' చనిపోతాడు. ఎవరో అతనిని చాలా దారుణంగా హత్య చేస్తారు. ఆ నిజం తెలిసి కార్తీక తన తండ్రిని నిలదీస్తుంది. తనకేమీ తెలియదని అతను ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. ఆ తరువాత కార్తీక జీవితంలోకి సురేశ్ .. గౌతమ్ అడుగుపెడతారు. వాళ్లు కూడా చాలా కిరాతకంగా చంపబడతారు.
ఈ నేపథ్యంలోనే ఈ అనుమానాస్పద మరణాలను గురించిన ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ 'చెలియన్' రంగంలోకి దిగుతాడు. హత్య జరిగిన ప్రదేశాలలో అద్దంపై 'పెదవుల' ముద్ర ఉండటం ఆయన గమనిస్తాడు. ఒక వైపున కార్తీక తండ్రి కదలికలపై కన్నేసిన చెలియన్, మరో వైపున గతంలో కార్తీకను ప్రేమించి ఆమెను పొందలేకపోయిన కుర్రాళ్లను గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? కార్తీకను ప్రేమించిన వాళ్లను హత్య చేస్తూ వెళ్లింది ఎవరు? అనేదే కథ.
శ్రీమంతుల కుటుంబానికి చెందిన అందమైన యువతి. అందువలన ఆమెను ప్రేమించడానికీ .. పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపడం సహజం. అలాంటి వాళ్లంతా చనిపోతూ ఉండటం, పోలీస్ డిపార్టుమెంట్ తలపట్టుకునేలా చేస్తుంది. నేరస్థులను పట్టుకోవడానికి సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
తెరపై జరుగుతున్న హత్యలకు కారకులు ఎవరనేది తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ తో పాటు ఆడియన్స్ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ పాత్రను ఫాలో అవుతూ, ఆయన మాదిరిగానే మూడు వైపుల నుంచి వాళ్లు తమ అనుమానాలను వ్యక్తం చేస్తుంటారు. వాళ్ల గెస్ కి అందకుండా దర్శకుడు నాలుగో కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాడు. అయితే అప్పటివరకూ అంతంత మాత్రంగా నడిచిన కథ ఇక్కడే మరింత బలహీనపడుతుంది.
ఈ తరహా సినిమాలలో హత్యలు జరిగే తీరు .. ఇన్వెస్టిగేషన్ .. ఈ రెండూ కీలకమైన అంశాలే. అందుకు సంబంధించిన సన్నివేశాలను డిజైన్ చేయడం పైనే కంటెంట్ మరింత బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది. కానీ ఈ కథ విషయంలో పై రెండు అంశాలు పేలవంగానే అనిపిస్తాయి. హత్యలు జరిగిన ప్రదేశాలలో లభించే 'క్లూ' పెదవులు (అధరాలు) ముద్రలు. ఈ సినిమా టైటిల్ కూడా అదే. అయితే ఆ విషయాన్ని హైలైట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ప్రేమలు .. హత్యలు .. అనుమానాలు .. ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ దాదాపు అన్ని కథల్లోను కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కథ విషయానికి వచ్చేసరికి కొత్త పాయింట్ ను టచ్ చేసినట్టుగా అనుకున్నారు. కానీ అది ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఈ తరహా పాయింట్ ను నవలలో చదువుకోవడానికి బాగుంటుందిగానీ, తెరపై చూపించడం కష్టమే. అయినా చివర్లో వచ్చే ఈ చిన్న ట్విస్ట్ కోసం మిగతా కథను భరిస్తూ రావడమూ కష్టమే.
కిశోర్ రామచంద్రన్ ఫొటోగ్రఫీ .. హరి నేపథ్య సంగీతం .. అశ్విన్ - సతీష్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. వరుస హత్యలతో నడిచే ఈ సినిమా, ఒక రొటీన్ స్టోరీ. చివరివరకూ ఫ్లాట్ గా నడిచిన ఈ కథలో చివర్లో చిన్నపాటి ట్విస్ట్ ఉంటుంది గానీ, అది ఎంతమాత్రం కనెక్ట్ కాదు. అందువలన ఆడియన్స్ ను ఈ సినిమా ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయిందని చెప్పాలి.
'అధరన్' (ఆహా) మూవీ రివ్యూ!
Andharan Review
Movie Details
Movie Name: Andharan
Genre: Mystery, Thriller
Release Date: 2026-09-18
Cast: Prajin Padmanabhan, Ivana Varun, Anupama Kumar, Sambasivam, Senthi Kumari
Director: Santhosah Raavanan
PRO: -
Music: Hari SR
Banner: Sri Krish Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer