నాని అంటే తెరపై పద్ధతి గల కుర్రాడు .. మన పక్కింటి కుర్రాడు .. మనందరికీ పరిచయం ఉన్న కుర్రాడు అనే అందరూ చెప్పుకుంటారు. అలా అందరూ 'మన' అనుకున్న కారణంగానే, ఫ్యామిలీస్ తో కలిసి నాని సినిమాలకి వెళుతూ ఉంటారు. నాని కథల పట్ల .. ఆయన ఎంచుకునే పాత్రల పాటల ఆడియన్స్ కి ఉన్న నమ్మకం అలాంటిది మరి. అలాంటి నాని ఈ సారి కాస్త డిఫరెంట్ గా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలనే ఆలోచనతో చేసిన సినిమానే 'ది ప్యారడైజ్'. గతంలో 'దసరా' సినిమాతో తనకి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేసిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

హైదరాబాద్ జిల్లా పరిధిలోని 'ప్యారడైజ్' ప్రాంతంలో, సంచారీ జాతికి చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. దాదాపు ఐదువేలమంది జనాభా కలిగిన ఈ జాతి ప్రజలు, ఎలాంటి గుర్తింపు లేకుండా బ్రతుకుతుంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తమకి రాకపోవడం పట్ల తీవ్రమైన అసంతృప్తికి లోనవుతారు. షికంజా మాలిక్ (మోహన్ బాబు) నిరంకుశ పాలనలో బానిసల మాదిరిగా బ్రతకలేక నానా కష్టాలు పడుతుంటారు. సంచారీ తెగ నుంచి తమకి గుర్తింపు కావాలని తొలిసారి గళం విప్పిన 'సమ్మక్క' (సోనాలీ కులకర్ణి) కొడుకే 'జడల్' (నాని). 

కొన్ని కారణాల వలన 'జడల్'కి తల్లి పట్ల కోపం .. అసహ్యం కలుగుతాయి. ఆ సమయంలో షికంజా మాలిక్ తన చేతిపై వేయించిన పచ్చ బొట్టు, తల్లి పట్ల ద్వేషాన్ని మరిచిపోనీయకుండా చేస్తుంది. 14 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన అతను, జైలు నుంచి విడుదలవుతాడు. షికంజా మాలిక్ అంతు చూడాలనే ఉద్దేశంతో 'ప్యారడైజ్'లో అడుగుపెడతాడు. అప్పటికి షికంజా మాలిక్ కొడుకు 'విక్రమ్ మాలిక్' (రాఘవ్ జుయల్), రాజకీయాలలోకి రావడానికి ట్రై చేస్తుంటాడు. కౄరత్వంలో అతను తండ్రిని మించిన తనయుడిని జడల్ తెలుసుకుంటాడు. 

'ప్యారడైజ్'లో అడుగుపెట్టిన 'జడల్' తల్లికి దూరంగా ఉంటూనే, తన జాతి కోసం పోరాడటానికి సిద్ధమవుతాడు. అందుకోసం ముందుగా విక్రమ్ మాలిక్ ను రాజకీయాలలోకి రాకుండా చేయాలని భావిస్తాడు. 'జడల్'కి తన తల్లిపై కోపం ఎందుకు? షికంజా మాలిక్ ను అంతం చేయాలనే అతని కోరిక నెరవేరుతుందా? సవారీ జాతి గుర్తింపు కోసం అతను చేసే ప్రయత్నం ఫలిస్తుందా? సినిమాలలో అవకాశాలు సంపాదించుకోలేక మద్రాస్ నుంచి తిరిగొచ్చిన సుబ్బలక్ష్మి ( కయాదు లోహర్), 'జడల్'కి ఎలా దగ్గరవుతుంది? అనేది కథ.

చరిత్రలోకి వెళితే తమ జాతి గుర్తింపు కోసం .. స్వేచ్ఛ కోసం .. ఈ రెండింటితో కూడిన జీవితం కోసం పోరాడిన గుంపులు చాలానే కనిపిస్తాయి. అలాంటి ఒక సంచారీ తెగ చుట్టూ, వాళ్లను బానిసలుగానే ఉంచే ఒక నియంత చుట్టూ తిరిగే కథ ఇది. తన తల్లి పోరాటం నీరుగారి పోవటానికి కారణం ఆమె వెనుక బలమైన నాయకుడు లేకపోవడమేనని తెలుసుకున్న ఒక కొడుకు, ఆ జాతికి తాను నాయకుడిగా మారిన వైనమే ఈ సినిమా కథ. 

ఈ కథ అంతా కూడా 1980లలో నడుస్తుంది. చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే అధికారం .. అహంకారానికి కారణమవుతుంది. అహంకారం అణచివేతకు కావలసిన బలాన్ని పొందుతూ రాక్షసానందాన్ని పొందుతుంది.అలాంటి అణచివేతలో నుంచే ఉద్యమాలు ఊపిరిపోసుకోవడం మొదలవుతుంది. అలాంటి ఈ రెండు అంశాలను కలుపుకుంటూ, ఒకప్పటి హైదరాబాద్ నేపథ్యంలో దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.

తన తల్లిని అపార్థం చేసుకున్న ఒక కొడుకు, తనలో తాను అంతర్యుద్ధం చేయడం ఫస్టాఫ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. షికంజా మాలిక్ ఆగడాలు .. దురాగతాలు ఈ భాగంలో పలకరిస్తాయి. ఇక తన తల్లి పట్ల గల అపార్థాలు తొలగిపోవడంతో నాయకుడిగా మారిన కొడుకు కథగా సెకండాఫ్ కొనసాగుతుంది. షికంజా మాలిక్ కుటుంబంపై 'జడల్' శంఖం పూరించే సన్నివేశాలు ఈ భాగంలో చోటుచేసుకుంటాయి. 

తన తల్లి ఆశయం కోసం ఆయుధం పట్టిన ఒక కొడుకు కథగా .. తన జాతికి అవసరమైన గుర్తింపు కోసం పోరాడిన ఒక నాయకుడి కథగా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. ఈ రెండు అంశాలు బలమైన ఎమోషన్స్ కి సంబంధించినవే. కానీ ఆ ఎమోషన్ ను కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పచ్చు. ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడం వలన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వెనకున్న పెయిన్ కనిపించదు .. రక్తపాతం మాత్రమే రిజిస్టర్ అవుతూ ఉంటుంది. 

 పాత్రలను డిజైన్ చేసిన విషయంలోను లోపాలు కనిపిస్తాయి. 'జడల్' పాత్ర గురించి ఒక రేంజ్ లో అనుకుంటూ ఉండగా, షికంజా వచ్చి అతణ్ణి తుక్కుకింద కొట్టేసి వెళతాడు. షికంజా గురించి ఒక రేంజ్ లో ఊహించుకుంటే, ఆ వెంటనే 'జడల్' వచ్చి అతని గల్లా పట్టుకుని బెదిరిస్తాడు. ఇక ఇప్పటి నుంచి కనిపించను అన్నట్టుగా మోహన్ బాబు ఎగ్జిట్ తీసుకుంటూ, యంగ్ విలన్ కి ఛాన్స్ ఇవ్వడంలో ఆంతర్యం కూడా మనకి బోధపడదు.

తెరపై విలన్ గా మోహన్ బాబు కనిపించగానే ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. కానీ ఆ ఉత్సాహాన్ని ఎక్కువసేపు ఉండనీయలేదు. ఇక నాని యాక్టింగ్ సంగతి అలా ఉంచితే, ఆ రెండు జడలతో స్టెప్పులు వేయడానికి చాలా అవస్థలు పడ్డాడనిపిస్తుంది. కయాదు లోహర్ .. ఆమె తల్లి పాత్రలు లేకపోవడం వలన, కథకి వచ్చే నష్టం లేదు .. ప్రేక్షకులు పడే బెంగా లేదు. సత్యరాజ్ ఎంట్రీ మరో అనవసరమైన హడావిడి. ఇక రాఘవ్ జుయల్  తన పాత్ర గురించి తానేం అనుకున్నాడో తెలియదు .. ప్రాధాన్యత లేని సంపూ పాత్రను చూస్తే మాత్రం పాపం అనిపిస్తుంది.  

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కి కొదవే లేదు. కాళ్లు .. చేతులు .. తలలు తెగిపడుతూ ఉంటాయి. చేతి వ్రేళ్ల దగ్గర నుంచి తల వరకూ నరుకుతూ వెళ్లడమే. రక్తాభిషేకం .. రక్త తర్పణం అనే మాటలు మనకి తప్పకుండా గుర్తొస్తాయి. మంటల్లో తోసేయడం .. గానుగలో వేసేయడం .. కట్టెలు కొట్టినట్టుగా తలకాయలను కొట్టడం వంటి హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి. ఇవన్నీ విలన్ అరాచకాలు అనుకుంటే పొరపాటే .. ఇవన్నీ హీరో వీరోచితాలే. 

అసలు ఈ సినిమాలో నాని రెండు జడలు ఎందుకు వేసుకున్నాడనేది తెలుసుకోవడానికే చాలా మంది వెళ్లుంటారు. ఆ మాట అతని తల్లి పాత్ర నోటి వెంట విన్నప్పుడు, హీరో అసలు పేరు దాచి దాచి చివర్లో చెప్పినప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తాయి. అసలు నాని ఇలాంటి ఒక కథను ఎలా ఒప్పుకున్నాడా అనే ఒక సందేహం థియేటర్ నుంచి ఇంటివరకూ మనతోనే వస్తుంది. 

సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలకు వంకబెట్టవలసిన పని లేదు. సాయి ఫొటోగ్రఫీ బాగుంది. అనిరుధ్ కి ఏం తోచిందో ఏమో పాపం .. ఏకబిగిన బాదేశాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ట్రిమ్ చేయవలసిన సీన్స్ .. లేపేయవలసిన సీన్స్ లేకపోలేదు.  విలన్ వైపు నుంచి క్లైమాక్స్ ను మరోరకంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మొత్తం మీద రెండు పాటలు .. 'కేసీఆర్' లుక్ తో ప్రియదర్శి కనిపించడంతో పాటు, ఒకటి రెండు సీన్స్ ఆకట్టుకుంటాయంతే. ఏదేమైనా ఈ సినిమాను నానీ చేసిన ప్రయోగంగా చూడలేము .. ఇది ఆయన చేసిన సాహసంగానే భావించవలసి ఉంటుంది.