మలయాళంలో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా పేరే 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్'. నివిన్ పౌలి - మమితా బైజు ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా ఇది. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, మలయాళంలో ఆగస్టు 21వ తేదీన విడుదలైంది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, 200 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అలాంటి ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 4వ తేదీన వచ్చింది.
జస్టిన్ (నివిన్ పౌలి) తన తల్లిదండ్రులతోను .. తమ్ముడు 'జోయెల్'తోను కలిసి నివసిస్తుంటాడు. క్యాటరింగ్ సర్వీస్ ను రన్ చేస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోవలసిన వయసు దాటిపోయి చాలాకాలమవుతుంది. స్నేహితులతో కలిసి తాగేస్తూ .. తిరిగేస్తూ ఉంటాడు. ఒక రోజున అతని పక్కింట్లోకి కొత్తగా ఒక ఫ్యామిలీ దిగుతుంది. తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంట్లోకి దిగిన అమ్మాయి పేరే 'యాష్లే' ( మమితా బైజు). ఆమె తండ్రి తాగుబోతు అనీ .. ఆ అమ్మాయి డిగ్రీ చదువుతోందనే విషయం జస్టిన్ కి తెలుస్తుంది.
'యాష్లే'ను చూసిన ఆ ఊరు కుర్రాళ్లంతా మనసు పారేసుకుంటారు. ఆమె ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతుంటారు. ముఖ్యంగా 'గ్లిక్సన్' ఆమె వెంటే తిరుగుతుంటాడు. జస్టిన్ కజిన్ సిస్టర్స్ రేష్మ - రియాలతో యాష్లేకి పరిచయమవుతుంది. వాళ్ల ద్వారానే ఆమె జస్టిన్ గురించి వింటుంది. ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయిన కారణంగానే అతను పెళ్లి చేసుకోలేదని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి అతని పట్ల ఆమెకి ప్రత్యేకమైన అభిమానం పుడుతుంది.
తనని యాష్లే ప్రేమిస్తుందని తెలుసుకున్న జస్టిన్ ఆ మాటను నమ్మలేకపోతాడు. ఇద్దరి మధ్యా ఉన్న ఏజ్ గ్యాప్ అందుకు కారణం. అయితే ఆమెనే స్వయంగా చెప్పడంతో ఆనందంతో పొంగిపోతాడు. అప్పటి నుంచి ఒకరికి ఒకరు మరింత చేరువైపోతారు. ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతుంటారు. అలాంటి పరిస్థితులలోనే యాష్లే మేనమామ 'అలెక్స్' ఆమె ఇంటికి వస్తాడు. జస్టిన్ కీ .. యాష్లే కి మధ్య ఏదో జరుగుతుందనే ఒక అనుమానం అతనికి వస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ ఎఫెక్ట్ ఆ ఇద్దరి జీవితాలపై ఎలా పడుతుంది? అనేది మిగతా కథ.
సాధారణంగా ప్రేమ ..పెళ్లి అంటూ అమ్మాయిల వెంట అబ్బాయిలే పడుతుంటారు. తమ వయసు కాస్త ముదిరిపోయినట్టుగా అనిపిస్తే, కవర్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటారు. అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ముదిరిపోయిన వ్యక్తి చుట్టూ, ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తిపై ఒక అమ్మాయి మనసు పారేసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చుట్టూ అల్లుకున్న కథనే ఈ సినిమా.
జస్టిన్ .. యాష్లే .. జస్టిన్ తమ్ముడు జోయెల్ .. యాష్లేను ఆరాధించే గ్లిక్సన్ .. యాష్లే మేనమామ అలెక్స్ .. ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయి. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వ్యక్తి పట్ల యాష్లే ఆకర్షితురాలు కావడం .. అతనికి తన మనసులోని మాటను చెప్పడం .. నమ్మలేని ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి అతను కొంత సమయం తీసుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇక తమ ప్రేమ విషయంలో పెద్దలకు సర్దిచెప్పే విషయంలో ఇద్దరూ పడే ఇబ్బందులతో సెకండాఫ్ కొనసాగుతుంది.
దర్శకుడు ఈ కథలో ఏ విషయాన్ని కూడా ప్రేక్షకుల దగ్గర కాసేపైనా దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. కథను అందంగా .. ఆహ్లాదంగా చెప్పడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ వెళ్లాడు. అందువల్లనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలని గానీ, క్లైమాక్స్ కి హడావిడి చేయాలని గాని అనుకోలేదు. అసలు ఇది ఒక సినిమాగా కాకుండా, మనకళ్ల ముందు జరుగుతున్న సంఘటనలను వీధి అరుగుపై కూర్చుని చూస్తున్నట్టుగా ఉంటుంది.
కథలో కావాలని కామెడీని ఇరికించే ప్రయత్నం చేయలేదు. సందర్భాన్ని బట్టి .. చిన్న చిన్న మాటలతనే నవ్వులు పూయించారు. నిజానికి అనువాద సినిమాలలో కామెడీ వర్కౌట్ కావడం కష్టం. కానీ ఈ సినిమాలో సంభాషణలు బాగానే కుదిరాయి. జోయెల్ .. గ్లిక్సన్ పాత్రల వైపు నుంచి కామెడీని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ చాలా ఏజ్ గ్యాప్ ఉన్న ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె అలా అనుకుందంటే ఆ వ్యక్తిలో గొప్ప లక్షణాలు ఉండాలి. అలాంటి లక్షణాలతో ఆ పాత్రను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తమ ప్రేమను వ్యక్తం చేసే విషయంలో .. అవతలవారి ప్రేమను అంగీకరించే విషయంలో ఆలస్యం చేయకూడదని భావించిన హీరో, తన తమ్ముడి ప్రేమ వివాహాన్ని దగ్గరుండి జరిపించడం హీరో పాత్రను మరింత ఎలివేట్ చేస్తుంది.
'పెళ్లి'కి నమ్మకమే పునాదిరాయి అని అంటారు. అయితే ఆ నమ్మకం ప్రేమ నుంచే మొదలవ్వాలి అని చాటిచెప్పే కథ ఇది. నిజమైన ప్రేమ అందాన్ని .. ఆస్తులను .. ఏజ్ గ్రూప్ ను కాదు, మంచి మనసును వెదుకుతూ వెళుతుందనే సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది.
పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండటం వలన ప్రతి ఒక్కరూ ఈ కంటెంట్ కి కనెక్ట్ అవుతారు. ప్రతి ఫ్యామిలీ కూడా తెరపై సన్నివేశాలలో భాగమవుతుంది. కామెడీ కోసం అక్కడక్కడా సన్నివేశాలు కొన్ని కాస్త 'అతి'గా అనిపించినప్పటికీ, ఆ వెంటనే దార్లో పడిపోతూ వచ్చింది. నిజానికి ఈ తరహా సన్నివేశాలను రాసుకోవడం .. తెరపై ఆవిష్కరించడం చాలా కష్టం. ఆడియన్స్ అనుభవంలోకి .. అనుభూతిలోకి తీసుకెళ్లడం మరింత కష్టం.
కథ .. కథనం .. సంభాషణలు .. సన్నివేశాలు .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఇవన్నీ కూడా కలిసిపోయి కనిపిస్తాయి. ఒకదాని నుంచి ఒకటి వేరు చేసి క్రెడిట్ ఇవ్వలేము. నటీనటుల సహజమైన నటన .. కంటెంట్ ను సహజంగా ఆవిష్కరించిన తీరు అందుకు కారణమని చెప్పాలి. చాలా కాలం తరువాత ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమాగా ఇది మార్కులు కొట్టేస్తుందని చెప్పచ్చు .
'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' - మూవీ రివ్యూ!
Bethlehem Kutumba Unit Review
Movie Details
Movie Name: Bethlehem Kutumba Unit
Genre: Comedy, Drama, Romance
Release Date: 2026-09-03
Cast: Nivin Pauly, Mamitha Baiju,Sangeeth Prathap,Roshan Shanavas, Shyam Mohan
Director: Girish A D
PRO: -
Music: Vishnu Vijay
Banner: Bhavana Studios
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer