హాస్యకథానాయకుడిగా అనేక చిత్రాలను చేసిన అల్లరి నరేశ్, ఈ మధ్య కాలంలో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ లను ట్రై చేస్తూ వెళుతున్నాడు. దాంతో ఆయన నుంచి మరో కామెడీ కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో వినోదభరిత చిత్రమే 'రంభ ఊర్వశి మేనక'. ఫాంటసీ టచ్ తో సాగే ఈ సినిమాకి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించాడు. ఈ రోజునే థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను నవ్వించిందనేది చూద్దాం.

సూరి (అల్లరి నరేశ్) 'పెద్ద బాణాపురం' అనే విలేజ్ లో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. తన తండ్రికి సినిమా హీరో కావాలనే కోరిక ఉంటుంది. అయితే డ్రామా ఆర్టిస్ట్ గానే ఆయన మిగిలిపోవలసి వస్తుంది. దాంతో తాను సినిమా హీరో కావాలనే పట్టుదలతో సూరి ఉంటాడు. సూరి చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఒక మేజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్ లోని చుక్కలను సరైన పద్ధతిలో కలిపితే, 'రంభ .. ఊర్వశి .. మేనక' దిగివస్తారు. కోరిన కోరికలను నెరవేరుస్తారు అనే విషయం తన బాబాయ్ రమణ (సీనియర్ నరేశ్) ద్వారా తెలుసుకుంటాడు. 

అప్పటి నుంచి సూరి ఆ మేజిక్ బుక్ పై చుక్కలను అనేక రకాలుగా కలపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. రంభ .. ఊర్వశి .. మేనక దిగివస్తే, తనని సినిమా హీరోను చేయమని అడగాలనేది అతని ఉద్దేశం. ఏనాటికైనా అది జరుగుతుందనే నమ్మకంతో, ఏ పని చేయకుండా తల్లి కష్టంపై ఆధారపడి బ్రతుకుతుంటాడు. త్వరలో సినిమా స్టార్ ను అవుతాననే ఆశతో స్టేజ్ నాటకాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. రంభ .. ఊర్వశి .. మేనక విగ్రహాలను పూజిస్తూ వాళ్లు ప్రత్యక్షమయ్యే రోజు కోసం వెయిట్ చేస్తుంటాడు.

 ఎక్కడా ఏ పనీ చేయకుండా తిరుగుతూ ఉండటంతో, సూరికి అప్పులు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలోనే చిన్నీ (సురభి) సూరిని ప్రేమిస్తూ ఉంటుంది. అతను కూడా ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. అయితే నెల రోజుల్లో అప్పులన్నీ తీర్చేసుకుంటే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాననీ, లేదంటే పోలీస్ ఆఫీసర్ అప్పలనాయుడితో ఆమె వివాహం జరిపిస్తానని చిన్నీ తండ్రి తెగేసి చెబుతాడు. అసలే అప్పలనాయుడితో స్కూల్ డేస్ నుంచి గొడవలు ఉండటంతో సూరి ఆలోచనలో పడతాడు. 

సాధ్యమైనంత త్వరగా రంభ .. ఊర్వశి .. మేనకలను ప్రత్యక్షం చేసుకుని, తనని ఈ గండం నుంచి గట్టెక్కించమని కోరాలని సూరి నిర్ణయించుకుంటాడు. అదేసమయంలో అతని తల్లి 'తులసమ్మ'కి ఒక సర్జరీ అవసరమవుతుంది. అందుకు 50 లక్షలు కావలసి వస్తుంది. ఉన్న అప్పులు తీర్చాలని అనుకుంటూ ఉండగా, కొత్తగా పెద్ద మొత్తంలో అప్పుచేయవలసి వస్తుంది. అప్పుడు సూరి ఏం చేస్తాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? రంభ ఊర్వశి మేనక అతని కోరికలు నెరవేరుస్తారా? చిన్నితో అతని పెళ్లి జరుగుతుందా? తన తల్లిని అతను బ్రతికించికోగలుగుతాడా? అనేది మిగతా కథ.

సాధారణంగా దేవతలను ప్రత్యక్షం చేసుకునే మార్గం ఏదైనా ఉంటే, అందరూ ఆ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కోరికలను ఆ దేవతలు తప్పకుండా నెరవేర్చుతారని తెలిసినప్పుడు, తాము చేయవలసిన ఏ పనీ చేయకుండా ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ కథలోని కథానాయకుడు కూడా అంతే. భారం మొత్తం అప్సరసలపై వేసి .. బద్దకంతో రోజులు గడిపేసే ఒక సూరి కథ ఇది.

చిన్నప్పటి నుంచి మేజిక్ బుక్ పైనే ఆశలు పెట్టుకుని పెరిగిన సూరి, రంభ .. ఊర్వశి .. మేనకను ప్రత్యక్షం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. బుక్ కారణంగా వాళ్లు భూలోకానికి రావడం .. తనకి చెప్పకుండా వెళ్లారనే కోపంతో దేవేంద్రుడు వాళ్లకి ఎలాంటి శక్తులు లేకుండా చేయడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. తిరిగి వెళ్లలేని అప్సరసలతో సూరి ఏం చేస్తాడు? అనే సందేహంతో కూడిన సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.

ఉన్న అప్పులు తీర్చకపోతే ప్రేమించిన అమ్మాయి దక్కకుండా పోతుంది. కొత్తగా అప్పు చేయకపోతే కన్నతల్లి ప్రాణాలతో దక్కకుండా పోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్సరసలు ప్రత్యక్షమైనా, వాళ్ల శక్తులన్నీ దేవేంద్రుడు అధీనంలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో తానున్న సమస్యలలో నుంచి ఒక సాధారణ యువకుడు ఎలా బయటపడతాడు? అనే ఒక ఉత్కంఠను రేకెత్తించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేస్తూ వెళ్లాడు.

ఒక వైపున దేవలోకంలో దేవేంద్రుడు .. మరో వైపున భూలోకంలో అప్సరసలు .. ఈ మధ్యలో అడపా దడపా వచ్చివెళ్లే యమధర్మరాజు హీరో సర్కిల్ ను టచ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు సాధ్యమైనంత వరకూ కామెడీని అద్దడానికి ప్రయత్నిస్తూ వెళ్లారు. బాహుబలి .. పోకిరి .. అవతార్ పోస్టర్ లపై హీరోగా అల్లరి నరేశ్ ను చూపించడం, రంభను లైన్లో పెట్టడానికి సీనియర్ నరేశ్ ట్రై చేయడం వంటి సన్నివేశాలు కొంతవరకూ నవ్వించగలుగుతాయి. అప్సరసలు రాగానే కోరికలన్నీ చెప్పడానికి ఒక చిట్టా తయారు చేయడం నవ్వు తెప్పిస్తుంది.

ఫస్టాఫ్ లో కాస్త పలచగా కనిపించిన కథ, ఆ తరువాత కొంత చిక్కబడినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ లో ఆడియన్స్ కాస్త ఫోకస్ పెట్టేలా చేస్తుంది. అల్లరి నరేశ్ కి ఇలాంటి పాత్రలు చేయడం చాలా తేలిక. ఇక సీనియర్ నరేశ్ .. శ్రీనివాసరెడ్డి .. వెన్నెల కిశోర్ కొంతవరకూ నవ్వించగలిగారు. అలాగే హీరో వైపు నుంచి మదర్ సెంటిమెంట్ ను కొంతవరకూ కనెక్ట్ చేయగలిగారు. 

రామ్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం ఫరవాలేదు. రంభ ఊర్వశి మేనకలతో కూడిన స్పెషల్ సాంగ్ తో పాటు మిగతా బాణీలు ఫరవాలేదు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. హీరో అతని ఫ్రెండ్స్ చిన్నీ దగ్గరికి వెళ్లి తన్నులు తినే సీన్ వంటివి ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ బాగుంది. 

ఈ సినిమా టైటిల్ 'రంభ.. ఊర్వశి .. మేనక'. వాళ్లే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు. అలాంటి పాత్రలకు ఆర్టిస్టుల ఎంపిక కరెక్టుగా లేదని అనిపిస్తుంది. ఇక వాళ్ల విగ్రహాలను మలచిన విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టలేదని తెలిసిపోతూనే ఉంటుంది. 'మేజిక్ బుక్'ను డిజైన్ చేసిన తీరు కూడా అంతే. అంత పెద్ద బుక్ ను చాలా తేలికగా పట్టుకుంటూ, అది పేజీలు లేని డమ్మీ బుక్ అనే విషయాన్ని చెప్పకనే చెబుతుంటారు.

'ఈ బూత్ బంగళాను బాగు చేయాలంటే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రావాలి', 'హతవిధీ కాదు సార్ .. ఇది గాంధీనగర్ రెండో వీధి', 'బలమైన సాక్ష్యులుగా కాదు .. బలవంతపు సాక్ష్యులుగా కనిపిస్తున్నారు' .. 'వీడు అనకొండ పాము కాదు .. మణికొండ పాము'.. 'వీడు ప్రతినాయకుడు కాదు .. అతి నాయకుడు' అనే డైలాగ్స్ నవ్వుకునేలా చేస్తాయి.

కాస్త అటు ఇటుగా ఈ తరహా కథలు గతంలో వచ్చినవే. అందువలన రొటీన్ కి భిన్నంగా మనకి ఏమీ అనిపించదు. అక్కడక్కడా కాస్త నవ్వించినా, మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇది ఓ మాదిరి సినిమాగానే అనిపిస్తుంది. కష్టపడితేనే కష్టాలను దాటుకుని ముందుకు వెళ్లగలం. ప్రయోజకుడైన ప్రతి కొడుకు తన తల్లి దృష్టిలో హీరోనే అనే సందేశం మాత్రం ఆలోచింపజేస్తుంది.