యాక్షన్ హీరోగా యశ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'కేజీఎఫ్' సినిమాతో ఆయన సృష్టించిన సంచలనాన్ని ఆడియన్స్ ఇంకా మరిచిపోలేదు. ఆయన కథానాయకుడిగా రూపొందిన మరో భారీ బడ్జెట్ సినిమానే 'టాక్సిక్'. కేవీఎన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి 'గీతూ మోహన్ దాస్' దర్శకత్వం వహించారు. కియారా అద్వాని .. రుక్మిణి వసంత్ .. తారా సుతారియా కథానాయికలుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ఈ రోజునే థియేటర్లకి వచ్చింది.

'రాయ' (యశ్) తన అక్క 'గంగ' (నయనతార)తో కలిసి 'గోవా'లో నివసిస్తుంటాడు. 'గోవా'లో ముఠాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఆ ముఠాల మధ్యలో తనదైన గుర్తింపును చాటుకోవడానికి 'రాయ' ప్రయత్నిస్తుంటాడు. 'గోవా'ను తన తమ్ముడు ఏలాలనే పట్టుదలతో 'గంగ' ఉంటుంది. ఆమె గైడెన్స్ తోనే అతను ముందుకు వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో ఒక ముఠా నాయకుడైన సాల్వడార్ కూతురు 'రెబెక్కా' (తార సుతారియా), 'రాయ'ను లవ్ చేస్తూ ఉంటుంది.

ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిచ్చే 'రాయల్ సర్కస్'లో నాడియా( కియారా అద్వాని) పనిచేస్తూ ఉంటుంది. నాడియాను చూసిన దగ్గర నుంచి 'రాయ' ఆమె మత్తులో పడిపోతాడు. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. ఈ విషయంలో 'రాయ'ను అతని అక్కయ్య సున్నితంగా మందలిస్తుంది. అయినా అతను వినిపించుకోడు. అతని కారణంగా 'నాడియా' గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలియగానే 'రెబెక్కా' అతనిపై సీరియస్ అవుతుంది. ఆమె తండ్రి అతనిని నిలదీస్తాడు. 'నాడియా'ను చంపేస్తామని 'రాయ'ను బెదిరిస్తాడు.

తన కారణంగా 'రాయ' ఇబ్బందులలో పడటం 'నాడియా'కి బాధను కలిగిస్తుంది. ఆమె కారణంగా 'రెబెక్కా' సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆమె తండ్రి వలన తమకి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే టెన్షన్ లో 'గంగ' ఉంటుంది. ఇదే అదనుగా భావించిన 'ఎలిజబెత్' (హుమా ఖురేషి) వర్గం, 'రాయ'ను దెబ్బ తీయడానికి రంగంలోకి దిగుతుంది. అప్పుడు 'రాయ' ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అక్కాతమ్ముళ్లు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? వాళ్ల ఫ్లాష్ బ్యాక్  ఏమిటి? అనేదే కథ.

ఈ కథ 1947- 67 మధ్య కాలంలో 'గోవా'లో జరుగుతుంది. 'గోవా' మాదక ద్రవ్యాలకు కేంద్రస్థానంగా ఉంటుంది. అక్కడ కొన్ని వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తూ ఉంటుంది. ఒక ముఠానాయకుడి కూతురు 'రాయ'పై మనసు పారేసుకుంటుంది. అదే సమయంలో  ఓ సర్కస్ యువతితో 'రాయ' ప్రేమలో పడతాడు. ఒక వైపున ఆధిపత్య పోరు .. మరో వైపున ప్రేమ వ్యవహారం చుట్టూ దర్శకురాలు ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. అలాంటి ఈ కథ కట్టి పడేసిందా? అంటే, 'మొట్టి' పడేసిందనే చెప్పాలి.

'రాయ' బాల్యం చేదు జ్ఞాపకాలతో నిండిపోతుంది. అందువలన అతను తన అక్క పట్ల తప్ప మరెవరి పట్ల ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోడు. అలాగే తన ఎదురుగా నిలబడి ప్రశ్నించేవారిని ఆయన ప్రాణాలతో వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి చుట్టూ ప్రధానమైన కథను అల్లుకుంటూ వెళ్లారు. మాఫియా సామ్రాజ్యంలో తన స్థానం .. తన అక్కయ్య .. తను ప్రేమించిన అమ్మాయిని తప్ప మరేదీ పట్టించుకోని ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని రాయ పాత్రకి ఆపాదిస్తూ ఈ కథను రాసుకున్నారు. 

అయితే 'గోవా' నేపథ్యంలో రాసుకున్న ఈ కథలో ఆధిపత్య పోరు పలచబడిపోయి, ప్రేమ వ్యవహారం చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. 'రాయ' పాత్ర అటు వృత్తిని .. ఇటు ప్రేమను సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించదు. కేవలం సెక్స్ పైనే పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తాడు. ఇక అతనిని టార్గెట్ చేసిన శత్రువులు, అప్పుడప్పుడు మాత్రమే తెరపైకి వచ్చి హడావిడి చేసి వెళుతుంటారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. కత్తులు కలబడుతూ ఉంటాయి. తుపాకులు కొట్లాడుతూ ఉంటాయి. గాల్లో తలకాయలు .. కాళ్లు - చేతులు ఎగిరిపడుతూ ఉంటాయి. అయితే ఎవరు ఎవరి తాలూక? .. ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? దేని కోసం వీళ్లంతా తుపాకులు పట్టుకుని విరిచుకుపడుతున్నారనే ప్రశ్నకి సమాధానం మనకి థియేటర్లలో దొరకదు. ఇంటికి వెళుతూ ఆలోచించినా అంతుబట్టదు.  

యశ్ ఉంటే, తుపాకులు పేలుతూ .. కత్తులు కాలుతూ ఉండాలనే ఒక ఆలోచన బాగానే ఉంది. కాకపోతే ఆ కత్తులకు .. తుపాకులకు మధ్య బలమైన కథ ఉండాలి. ఆ కథలో ఎమోషన్స్ ఉండాలి. ఆ ఎమోషన్స్ లో జీవం ఉండాలి. అలాంటి కథ లేనప్పుడు ఆ చప్పుళ్లను వింటూ ప్రేక్షకులు థియేటర్లో కూర్చోలేరు. కథ అనేది దండలో దారం మాదిరిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా తెరపై సన్నివేశాలను పారబోస్తూ వెళ్లి, వాటిని స్క్రీన్ ప్లే చేసుకునే బాధ్యతను ఆడియన్స్ కి అప్పగించకూడదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.

మిగతా పాత్రల సంగతి అటుంచితే, యశ్ పాత్రను మాత్రం అదే స్వభావానికి కట్టేసి చివరి వరకూ లాక్కొచ్చారని అనుకునేలోగా, ఒక ట్విస్ట్ ఇచ్చారు. అప్పటికే కుదేలైన ఆడియన్స్ ఆ ట్విస్ట్ దెబ్బకి గింగిరాలు తిరుగుతారు. డబుల్ పైత్యాన్ని అనుభవించవలసి వస్తుందనే విషయాన్ని అప్పటివరకూ ఎవరూ ఊహించరు కూడా. తెరపై మొదటి నుంచి కాపాడుకుంటూ వచ్చిన కేరక్టర్ ను కూడా 'రాయ' కోల్పోవడం అన్నిటికంటే పెద్ద ట్విస్ట్. అప్పటివరకూ ఇబ్బంది పెడుతూ వచ్చిన కంటెంట్, క్లైమాక్స్ లో భయపెట్టడం కొసమెరుపు. 

ఈ సినిమాలోని పాత్రల కోసం ఆర్టిస్టులను ఎంపిక చేసిన తీరును వంకబెట్టలేం. కాకపోతే మానసిక పరమైన లోపాలతోనే ఆ పాత్రలను డిజైన్ చేయడం విచారించదగిన విషయం. నిర్మాణ పరమైన విలువలు బాగున్నాయి. రాజీవ్ రవి ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం గట్టిగానే ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే, అది కూడా ఆడియన్స్ కే వదిలేశారేమో అనిపిస్తుంది. 

ఏ సినిమా విషయంలోనైనా బలమైన కథకి భారీతనం అదనపు బలం అవుతుందంతే. భారీతనమే విజయాన్ని తెచ్చిపెట్టలేదు. అలాగే కథలో హింస ఉంటే ఆడియన్స్ భరిస్తారు. కానీ హింసతోనే కథను చెప్పడానికి ప్రయత్నిస్తే అసహనానికి లోనవుతారు. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని చెప్పచ్చు.