నరేశ్ అగస్త్య వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి నరేశ్ అగస్త్య నుంచి వచ్చిన మరో సినిమానే 'ఎమ్ఆర్ పీ'. 'నీకెంత నాకెంత' అనేది క్యాప్షన్. డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహించాడు. జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నెల తిరక్కముందే ఓటీటీకి వచ్చేసింది.
మనోహర్ (నరేశ్ అగస్త్య) పరమేశ్వర్ ( సుదర్శన్) రవి ( కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ మంచి స్నేహితులు. హైదరాబాద్ లో ఒకే రూమ్ లో కలిసి ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మనోహర్ ను అదే ఆఫీసులో పనిచేసే అమృత ప్రేమిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్లు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తొందర చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ జీతాన్ని సంపాదిస్తున్న మనోహర్, బిజినెస్ చేసి తన స్థాయిని మార్చుకోవాలనుకుంటాడు. అందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమవుతుంది.
ముగ్గురు స్నేహితులు తమ సొంత ఊరుకి వెళ్లి, డబ్బు కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అదే సమయంలో కామేశ్వర రావు హత్య జరుగుతుంది. కామేశ్వరరావుకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు 'దైవాజీ' (నంద గోపాల్) పెద్ద రౌడీ. వడ్డీలకు డబ్బులు తిప్పుతూ, వడ్డీ ఇవ్వనివారిని హింసిస్తూ ఉంటాడు. తన తల్లి చనిపోతే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడనే ఒక కోపం అతనికి ఉంటుంది. చిన్న కొడుకు 'భాను' మాత్రం తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. పెద్ద కొడుకు కారణంగా చనిపోయిన కామేశ్వర రావు బాడీ హాస్పిటల్లో ఉంటుంది.
'దైవాజీ' దగ్గర మనోహర్ మిత్ర బృందం అప్పు తీసుకుంటుంది. అయితే గడువులోగా వడ్డీ చెల్లించలేకపోతారు. దాంతో మొత్తం బాకీ తీర్చమని అతను రెండు రోజులు గడువు పెడతాడు. దాంతో వాళ్లు కామేశ్వరరావు బాడీని హాస్పిటల్ నుంచి తరలించి, భానుని డబ్బు కోసం డిమాండ్ చేస్తారు. ఆ తరువాత చూస్తే కామేశ్వర రావు బాడీ స్థానంలో ఒక లేడీ శవం ఉంటుంది. కామేశ్వరరావు బాడీ ఏమైందనేది తెలియదు. లేడీ బాడీ ఎవరిదనేది అంతుబట్టదు .. ఆమె ఎలా చనిపోయిందనేది అర్థం కాదు. అప్పుడ్డు వాళ్లు ఏం చేస్తారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ.
ముగ్గురు స్నేహితులు చాలీ చాలని జీతాలతో సంతోషంగా బ్రతకలేమని భావించి, ఒక రౌడీ షీటర్ దగ్గర అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చడం కోసం అతని తండ్రి డెడ్ బాడీని రహస్యంగా తరలిస్తారు. ఆ రౌడీ షీటర్ తమ్ముడికి కాల్ చేసి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తారు. అయితే అతను ఆ డబ్బు తెచ్చేలోగా, తాము తీసుకొచ్చింది ఒక లేడీ డెడ్ బాడీని అని తెలిసి మిత్ర బృందం ఉలిక్కి పడుతుంది. ఈ రెండు డెడ్ బాడీల చుట్టూనే రాసుకున్న కథ ఇది.
స్నేహితులు ముగ్గురు సిటీలో సరదాగా తిరగడం .. ప్రేమలో పడటం .. డబ్బు కోసం అవస్థలు పడటం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక పొరపాటున తాము తెచ్చేసిన లేడీ డెడ్ బాడీ ఎవరిదనేది తెలుసుకోవడానికి మిత్రబృందం చేసే ప్రయత్నాలతో .. తండ్రి డెడ్ బాడీ కోసం కొడుకులిద్దరూ వేరు వేరు ఉద్దేశాలతో వెతకడంతో సెకండాఫ్ కొనసాగుతుంది. సుదర్శన్ .. కసిరెడ్డి కామెడీ సరిపోదన్నట్టుగా, ఈ మధ్యలోనే 'మేగ్నట్ మణి' పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇస్తాడు.
స్నేహితులు ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకోవడం .. ఆ గండం నుంచి బయటపడటానికి నానా అవస్థలు పడటం వంటి కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కామెడీకి .. క్రైమ్ కి ప్రాముఖ్యతనిస్తూ వెళ్లారు. అయితే ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు. క్రైమ్ వైపు నుంచి ఆకట్టుకున్నది కూడా చాలా తక్కువ.
కథాకథనాలలో ఎక్కడా గాఢత కనిపించదు. తేలికైన సన్నివేశాలతో అలా అలా తేలిపోతూ ఉంటుంది. విలనిజం ఒక స్టేజ్ డ్రామాను తలపిస్తూ ఉంటుంది. విలన్ కి తండ్రిపై కోపానికి గల కారణం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ మధ్య సాగే 'ఒక్కమాటే' అనే సాంగ్ మాత్రం ఫరవాలేదు అనిపిస్తుంది. సింపుల్ లైన్ తో నడిచే రొటీన్ డ్రామాగా ఈ సినిమా మిగిలిపోతుందని చెప్పచ్చు.
కామెడీని పండించే నటులనే తీసుకున్నారు గానీ, సరైన కామెడీ సీన్స్ రాసుకోలేకపోవడమే ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం అంతగొప్పగా ఏమీ అనిపించవు. సాగతీత సన్నివేశాలతో ఎడిటింగ్ కూడా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే. టైమ్ పాస్ కే అయినా, అక్కడక్కడా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసే సినిమానే ఇది.
'ఎమ్ఆర్ పీ'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
MRP : Neekentha Naakentha Review
Movie Details
Movie Name: MRP : Neekentha Naakentha
Release Date: 2026-08-07
Cast: Naresh Agastya,Donal Bisht,Vennela Kishore,Rajkumar Kasireddy,Sudarshan,Nanda Gopal,Harshavardhan
Director: Shravan Jesta
Music: Ajay Arasada
Banner: Panchajanya Features
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer