సముద్రఖని - ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన తెలుగు సిరీస్ 'ఇసకపట్నం'. గ్యారీ  బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా రూపొందింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్, ఈ రోజు (జులై 2)వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సునీల్ .. నరేశ్ అగస్త్య .. రాజీవ్ కనకాల .. బెనర్జీ కీలకమైన పాత్రలను పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

నాయుడు (సముద్రఖని) తన భార్యాబిడ్డలతో కలిసి, ఒక సాధారణ వ్యక్తిలా 'ఇసకపట్నం'లో అడుగుపెడతాడు. సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు జీవించే ప్రాంతం అది. అక్కడి మత్స్య కారులంతా చిన్నారావు (రాజీవ్ కనకాల) చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటారు. అది 'పోతన' (జ్వాలా కోటి)కి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అది గ్రహించిన నాయుడు, అతని సపోర్టుతో చిన్నరావును హత్య చేసి తాను నాయకుడు అవుతాడు.

నాయుడు ఆ పోర్టు ఏరియాలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు. అతని కూతురు భారతి (ఐశ్వర్య రాజేశ్) వయసుకి వస్తుంది. తండ్రి దుర్మార్గాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఆమె, సమాజానికి మేలు చేసే పనులను చేస్తూ వెళుతుంటుంది. తమ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న సూరి (సుధాకర్ కోమకుల)తో ప్రేమలో ఉంటుంది. నాయుడు ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతూ వెళ్లడాన్ని పోతన తట్టుకోలేకపోతాడు. నాయుడికి శత్రువైన జమిందార్ ప్రతాప్ వర్మ ( రవి వర్మ) సపోర్టు తీసుకుంటాడు.

అదే ఊళ్లో ఆటో నడుపుకుని జీవిస్తున్న పెద్దన్న (నరేశ్ అగస్త్య)కి కార్పొరేటర్ కావాలని ఉంటుంది.  రాజకీయాలకు .. ముఠా తగాదాలకు దూరంగా అతను తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇక నాయుడు కూడానే ఉండే శేఖరం (రాజా) అతని కుర్చీలో కూర్చునే అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే పోతన - ప్రతాప్ వర్మ చేతులు కలిపినట్టుగా నాయుడికి తెలుస్తుంది. ప్రతాప్ వర్మకి గల ఆర్ధికబలం గురించి తెలిసిన నాయుడు, అతనికి తన కూతురు భారతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

అప్పుడు భారతి ఎలా స్పందిస్తుంది? ఆమె ప్రేమకథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? ప్రతాప్ వర్మను తనవైపుకు తిప్పుకోవడానికి నాయుడు వేసిన ప్లాన్ ఫలిస్తుందా? అతని వారసుడిగా పెత్తనం చెలాయించాలని ఆశపడుతున్న శేఖరం పరిస్థితి ఏమిటి? పోతనకి దక్కే ఫలితం ఎలాంటిది? పెద్దన్న కార్పొరేటర్ అవుతాడా? చివరికి గెలుపెవరిది? అనేది మిగతా కథ.

కుటుంబం పట్ల ప్రేమ .. ఇతరుల పట్ల జాలి .. సమాజం పట్ల బాధ్యత లేని వారు ఎంతకైనా తెగిస్తారు. డబ్బు .. అధికారం గురించి మాత్రమే ఆలోచించే అలాంటివారిలో రాక్షసత్వం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక మనిషిలాంటి మృగం చుట్టూ తిరిగే కథ ఇది. అతని ప్రయాణం .. ఆ దారిలో అతనికి సహకరించే పాత్రలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. తన ముఠా రాజకీయాలకు కూతురు జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనుకాడని ఒక కఠినాత్ముడి కథ ఇది.

ఈ సిరీస్ ను చూస్తున్నప్పుడు మనకి అర్థమయ్యేది ఏమిటంటే, ఇది ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య జరిగే పోరాటం అనిపిస్తుంది. అందువలన సముద్రఖనితో సమానమైన పవర్ తో ఐశ్వర్య రాజేశ్ పాత్ర ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు .. కానీ అలా జరగలేదు. ఐశ్వర్య రాజేశ్ పాత్రను గాడిలో  పెట్టడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఈ లోగా ఆమెపై ఆవిష్కరించిన సన్నివేశాలలోను అంతగా దమ్ము కనిపించదు.

ఫస్టు ఎపిసోడ్ లోనే చాలా కథ చెప్పారు. అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే ఆ స్థాయి స్పీడ్ లో మిగతా ఎపిసోడ్స్ పరిగెత్తలేకపోయాయి. కథ ఒక దశకి చేరుకున్న తరువాత అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. పెద్దగా ట్విస్టులు లేకపోవడం .. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ రేకెత్తించక పోవడం అసంతృప్తిని  కలిగిస్తుంది. చూస్తున్నంత సేపు బాగానే అనిపిస్తుంది .. కానీ ఎక్కడా కొత్త మలుపు అనేది మాత్రం కనిపించదు.   

కథా పరంగా చూసుకుంటే ముఖ్యమైనవిగా చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ ఆ పాత్రలకు తగిన పవర్ ను జోడించలేకపోయారు. ఆయా పాత్రల మధ్య ఎత్తులు పయ్యెత్తులను ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. చుట్టూ ఎన్ని పాత్రలు ఉన్నప్పటికీ సముద్రఖని పాత్ర మాత్రమే హైలైట్ అవుతూ ఉంటుంది .. ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన స్థాయికి తగిన పాత్రలు చుట్టూ లేకపోవడం వలన, ఆడియన్స్ లో ఎలాంటి అటెన్షన్ లేకుండా పోతుంది.

నరేశ్ అగస్త్య పాత్రను కూడా చాలా వరకూ వదిలేశారు. అప్పుడప్పుడు మాత్రమే కనిపించే ఆ పాత్ర కనెక్ట్ కాలేకపోయింది. ఇక చాలా తెలివైనది .. ధైర్యవంతురాలైన భారతి, తన పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పకుండా మనలను అయోమయంలో పడేస్తుంది. ఆమె ఉద్దేశం ఏమిటనేది చెప్పే విషయంలో కూడా క్లారిటీ లోపించిందేమో అనే భావన కలుగుతుంది. 

నిర్మాణ పరమైన నాణ్యత విషయంలో ఎక్కడా వంక బెట్టవలసిన పనిలేదు. ఒక సినిమాను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. పాత్రలు .. ఆ పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక కరెక్టుగా ఉంది. వంశీ పచ్చి పులుసు ఫొటోగ్రఫీ .. ప్రవీణ్ లక్కరాజు సంగీతం బాగున్నాయి. బలమైన కథను రాసుకున్నారు .. సన్నివేశాలను అంతే బలంగా ఆవిష్కరించారు. అయితే ఆయా పాత్రలను డిజైన్ చేసిన తీరులోనే కొంత లోపం కనిపిస్తూ ఉంటుంది. సముద్రఖని నటనను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.