పాక్‌ ప్రభుత్వాన్ని ‘ఫామ్‌ 47 సర్కార్‌’ అన్న భారత్‌.. అసలు దాని అర్థం ఏంటి?
Add ap7am to your home Screen

పాక్‌ ప్రభుత్వాన్ని ‘ఫామ్‌ 47 సర్కార్‌’ అన్న భారత్‌.. అసలు దాని అర్థం ఏంటి?

India calls Pakistan government Form 47 Sarkar what does it mean
  • ఐరాస వేదికగా షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ‘ఫామ్‌ 47 సర్కార్‌’ అన్న భారత్‌
  • పాకిస్థాన్‌ ఎన్నికల్లో ‘ఫామ్‌ 45’ అనేది ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలను చూపించే పత్రం
  • ‘ఫామ్‌ 47’ నియోజకవర్గం స్థాయిలో ఫలితాలను చూపించే డాక్యుమెంట్‌
  • 2024 ఎన్నికల్లో ఫామ్‌ 45, ఫామ్‌ 47 వివరాలు సరిపోలలేదన్న పీటీఐ
  • ఫామ్‌ 47లో అక్రమాలు చేశారని ఆరోపించే కోణంలోనే కొత్త పదబంధంతో విమర్శలు
పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఆ ప్రభుత్వాన్ని ‘ఫామ్‌ 47 సర్కార్‌’గా అభివర్ణించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై దృష్టి పెట్టకుండా తప్పుడు ప్రచారానికి పాకిస్థాన్‌ ప్రాధాన్యం ఇస్తోందని భారత దౌత్యవేత్త రఘు పూరి ఆరోపించారు. గతంలో పాకిస్థాన్‌ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలే ఇప్పుడు ఆ దేశానికి సమస్యగా మారాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విమర్శ వెనుక ఉన్న ‘ఫామ్‌ 47’ వివాదం ఏంటి?

2024లో పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల నుంచి ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ (పీటీఐ) పార్టీ ఆరోపించింది. ఎన్నికల ఫలితాలను మార్చి షరీఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించింది. ఈ ఆరోపణలను పాక్‌ ప్రభుత్వం ఎలా చూస్తోందనే అంశం వేరైనా, ఎన్నికల ఫలితాల లెక్కల్లో తేడాలున్నాయన్నది అప్పటి వివాదంలో ప్రధాన అంశం.

పాకిస్థాన్‌ ఎన్నికల్లో ‘ఫామ్‌ 45’ అనేది ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలను చూపించే పత్రం. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న సమాచారం ఇందులో ఉంటుంది. ‘ఫామ్‌ 47’ మాత్రం నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల ఫలితాలను కలిపి రూపొందించే తాత్కాలిక సమగ్ర ఫలితాల పత్రం. అంటే ‘ఫామ్‌ 45’ పోలింగ్‌ కేంద్రం స్థాయిలో, ‘ఫామ్‌ 47’ నియోజకవర్గం స్థాయిలో ఫలితాలను చూపిస్తాయి.

2024 ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ‘ఫామ్‌ 45’లో ఉన్న ఓట్ల వివరాలు, ‘ఫామ్‌ 47’లో నమోదైన లెక్కలతో సరిపోలలేదని పీటీఐ ఆరోపించింది. తమ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాల లెక్కల ప్రకారం గెలిచినా, తుది ఫలితాల్లో ఓడిపోయినట్లు చూపించారని పేర్కొంది.

ఆ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు గెలుచుకున్నారు. అయినప్పటికీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కామన్వెల్త్‌ ఎన్నికల పరిశీలకుల నివేదికలోనూ కొన్ని ‘ఫామ్‌ 47’ పత్రాల్లో మార్పులు జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.

దీంతో షరీఫ్‌ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పీటీఐ ‘ఫామ్‌ 47 సర్కార్‌’ అనే పదాన్ని వాడుతోంది. ఎన్నికల్లో అక్రమాల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమని ఆరోపించడమే ఈ పదం వెనుక ఉద్దేశం. ఐరాస వేదికగా భారత్‌ ఈ పదాన్ని ప్రస్తావించడంతో పాకిస్థాన్‌ ఎన్నికల విశ్వసనీయతపై ఉన్న వివాదం మరోసారి అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.
Advertisement
Shehbaz Sharif
Form 47 Sarkar
Pakistan Election 2024
India Pakistan UN clash
Raghu Puri UN
PTI election rigging

More Telugu News