మొబైల్ ఫోన్ ఇప్పుడు సుపరిపాలనకు సాధనం: ప్రధాని మోదీ
Add ap7am to your home Screen

మొబైల్ ఫోన్ ఇప్పుడు సుపరిపాలనకు సాధనం: ప్రధాని మోదీ

Mobile phone is now a tool for good governance says PM Modi
  • దేశంలోని ప్రతీ జిల్లాకు 5జీ సేవలు విస్తరించాయ‌న్న మోదీ
  • మొబైల్ ఇంటర్నెట్ వేగం 2022తో పోలిస్తే 10 రెట్లు పెరిగింద‌ని వెల్ల‌డి 
  • డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతిక అంతరాలను తగ్గించామ‌న్న ప్ర‌ధాని
  • కోవిడ్ సమయంలో డిజిటల్ వ్యవస్థ దేశాన్ని నడిపించింద‌ని వ్యాఖ్య‌
భారత టెలికాం రంగం కేవలం నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్, ఇంటర్నెట్ వేగానికే పరిమితం కాలేదని, సుపరిపాలన, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో మొబైల్ కనెక్టివిటీ ఒక కీలక శక్తిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నేడు ఢిల్లీలో ప్రారంభమైన 10వ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' (ఐఎంసీ) 2026 సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 

గత దశాబ్ద కాలంలో మొబైల్ ఫోన్లు సాధారణ కమ్యూనికేషన్ పరికరాల స్థాయి నుంచి సుపరిపాలనను అందించే ముఖ్యమైన సాధనాలుగా రూపాంతరం చెందాయని అన్నారు. 'మొబైల్ ఫోన్ ఇప్పుడు సుపరిపాలనకు ఒక సాధనంగా మారింది' అని ఆయన పేర్కొన్నారు. భారత టెలికాం ప్రస్థానంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని ప్రధాని గుర్తుచేశారు. 

"2022లో ఇదే వేదికపై దేశంలో 5జీ సేవలను ప్రారంభించాం. 2023 నాటికి 5జీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంలో ముందడుగు వేశాం. ఈ రోజు దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ కనెక్టివిటీ చేరింది. ప్రస్తుతం దేశంలో 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. 2022తో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వేగం 10 రెట్లు పెరిగింది" అని ప్రధాని వివరించారు.

ఒక దశాబ్దం క్రితం దేశంలో 'డిజిటల్ విభజన' ఒక పెద్ద సవాలుగా ఉండేదని, కొత్త సాంకేతికత కొందరికే దక్కేదని మోదీ గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించేందుకే 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించామని, మొబైల్ ఫోన్‌ను కేంద్రంగా చేసుకుని డిజిటల్ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. భారతీయులకు టెలికాం అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అంతకు మించి అని ఆయన అన్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో భారత డిజిటల్ వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయినప్పుడు కూడా, మన దేశంలో కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు డిజిటల్ మౌలిక సదుపాయాల వల్లే నిరంతరాయంగా పనిచేయగలిగాయని గుర్తుచేశారు. 

ఈ ఏడాది ఐఎంసీ థీమ్ 'సరిహద్దులు లేని విస్తరణ' (Scale Without Boundaries) అని, ఇది భారత టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు. అక్టోబర్ 7 నుంచి 10 వరకు జరగనున్న ఈ సదస్సును టెలికమ్యూనికేషన్స్ విభాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన దేశ, విదేశీ టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులకు ప్రధాని స్వాగతం పలికారు.
Advertisement
Narendra Modi
India Mobile Congress 2026
5G Connectivity India
Digital India Initiative
Telecom Sector Growth
Mobile Governance

More Telugu News