అమరావతిలో మాస్ ట్రాన్స్‌పోర్టేషన్, అసెంబ్లీపై స్పియర్ టవర్: సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు

అమరావతిలో మాస్ ట్రాన్స్‌పోర్టేషన్, అసెంబ్లీపై స్పియర్ టవర్: సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు

Chandrababu Naidu discusses Amaravati mass transport and Sphere Tower at CRDA meeting
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 66వ అథారిటీ సమావేశం
  • అసెంబ్లీ భవనంపై రూ.661 కోట్లతో స్పియర్ టవర్ నిర్మాణానికి ఆమోదం
  • రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.1548 కోట్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్
  • విజయవాడ-గుంటూరును కలుపుతూ మాస్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థకు ప్రణాళికలు
  • ఎకరం లోపు రైతులకు కూడా యాన్యుటీ చెల్లింపునకు సమావేశం అంగీకారం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. రాజధాని నగరానికి మకుటాయమానంగా నిలిచేలా అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్ నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. స్పియర్ టవర్, లిఫ్టుల నిర్మాణం కోసం రూ.661 కోట్ల వ్యయానికి సమావేశం అంగీకారం తెలిపింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీ భవనంపై నిర్మించే ఈ స్పియర్, ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా, ఓ వ్యూ పాయింట్‌తో సహా నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్పీఎస్) జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో దశ భూసమీకరణలోనూ ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు కూడా యాన్యుటీ చెల్లించే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో పాటు, హోటళ్లు, పాఠశాలలకు భూములు కేటాయిస్తూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు కూడా అంగీకారం లభించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీప ప్రాంతాలను కలుపుతూ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఒక సమగ్ర మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్ రెవెన్యూ మోడల్స్‌పై అధ్యయనానికి ఓ కమిటీని నియమిస్తామని తెలిపారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి నగరాలను కలిపి అమరావతి ఒక మెగా సిటీగా రూపుదిద్దుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అమరావతి బ్రాండ్‌ను దేశ, విదేశాల్లో మార్మోగేలా విస్తృత ప్రచారం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల లడఖ్‌లో ఓ బాలుడు మన రాష్ట్ర బైకర్‌ను 'అమరావతి నుంచి వచ్చారా' అని అడగడమే ప్రజల మనసుల్లో రాజధాని ఎంతగా నాటుకుపోయిందో చెప్పడానికి నిదర్శనమని అన్నారు. "ప్రతీ పౌరుడూ ఇది నా నగరం అని భావించేలా అమరావతిని తీర్చిదిద్దాలి" అని ఆయన పేర్కొన్నారు. నగరంలో 50 శాతం పచ్చదనం, బయోడైవర్సిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని, కొండలు, నీటి వనరులను సుందర ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి బ్లూప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.


Advertisement
Chandrababu Naidu
Amaravati Capital City
CRDA Authority Meeting
Amaravati Sphere Tower
Andhra Pradesh Mass Transport
Amaravati Infrastructure Tenders

More Telugu News