భారతీయులకు ట్రంప్‌ షాక్‌.. హెచ్‌-1బీ వీసాకు రూ.86 లక్షల అదనపు భారం!

Donald Trump shock to Indians with 86 lakh rupees additional H-1B visa fee
  • హెచ్‌-1బీపై 1,03,265 డాలర్ల అదనపు రుసుము
  • ఒక్కో దరఖాస్తుపై సుమారు రూ.86 లక్షల అదనపు భారం
  • ఏటా 85 వేల క్యాప్‌-సబ్జెక్ట్‌ వీసాలకు రుసుము వర్తింపు
  • మాస్టర్స్‌ కోటాలోని 20 వేల వీసాలకూ అదనపు ఫీజు
  • ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాల స్వీకరణ
అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ఇక సంస్థలకు భారీ భారంగా మారనుంది. హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఏకంగా 1,03,265 డాలర్ల అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ప్రస్తుత మారకం విలువ ప్రకారం ఇది సుమారు రూ.86 లక్షలు. భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఏటా జారీ చేసే 85 వేల హెచ్‌-1బీ వీసాలన్నింటికీ ఈ రుసుము వర్తించనుంది. అమెరికా యూనివర్సిటీల నుంచి మాస్టర్స్‌ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత పొందిన వారికి కేటాయించే 20 వేల వీసాలు కూడా ఇందులోనే ఉంటాయి. సాధారణ రుసుములతో పాటు ఈ అదనపు మొత్తాన్ని కూడా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదన ఇంకా తుది రూపం దాల్చలేదు. మంగళవారం ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురించిన తర్వాత 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తారు.

ఈ రుసుము ద్వారా ఏటా 8.8 బిలియన్‌ డాలర్లు సమకూరుతాయని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అంచనా వేసింది. వలస దరఖాస్తుల పరిశీలన, మోసాల గుర్తింపు, జాతీయ భద్రత తనిఖీలు, ప్రభుత్వ వ్యవస్థల ఆధునికీకరణకు ఈ నిధులు వినియోగిస్తామని తెలిపింది. వలస న్యాయస్థానాలు, కాన్సులర్‌ సేవలు, కార్మిక ప్రమాణాల అమలుకూ నిధులు వెళ్తాయని పేర్కొంది.

అయితే ఈ నిర్ణయంపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న సంస్థలపై భారీ ఆర్థిక ప్రభావం పడుతుందని చెబుతున్నాయి. ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్‌ అధ్యక్షుడు టాడ్‌ షుల్టే దీన్ని అమెరికా వ్యాపార సంస్థలపై భారీ పన్నుగా అభివర్ణించారు.
Advertisement
Donald Trump
H-1B Visa Fee
Indian IT Professionals
US Immigration Policy
Homeland Security
US Visa News

More Telugu News