Advertisement

ఉద్యోగం మారాలనుకుంటున్నారా? ఒక్కసారి ఈ 20 ఏళ్ల అనుభవం ఉన్న టెక్కీ మాట వినండి..!

Thinking of changing your job Listen to this techie with 20 years experience
  • 20 ఏళ్ల అనుభవం ఉన్నా దక్కని ఉద్యోగం
  • ఏడాదిగా ఉద్యోగ వేటలో ఎడ్వర్డ్‌ వైట్‌హెడ్‌
  • ఇక ప్రయత్నించడం ఆపేయాలనిపిస్తోందంటూ భావోద్వేగ పోస్ట్‌
  • ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వెల్లడి
  • రెండు సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులపై దృష్టి
  • టెక్‌ రంగంలో ఉద్యోగాలపై మరోసారి చర్చ
ఆఫీస్‌లో ఒత్తిడి ఎక్కువైందని, పని నచ్చడం లేదని, కొత్త ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో చాలామంది ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఈ టెకీ కథ ఒకసారి తెలుసుకోవాల్సిందే. 20 ఏళ్ల అనుభవం, టెక్నికల్‌ లీడర్‌గా పనిచేసిన ట్రాక్‌ రికార్డ్‌ ఉన్నా.. ఏడాది నుంచి ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. ‘‘కొన్నిసార్లు ఇక వదిలేయాలనిపిస్తోంది’’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల దృష్టిని ఆకర్షిస్తోంది.

దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్‌ కేప్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఎడ్వర్డ్‌ వైట్‌హెడ్‌ దాదాపు ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయారు. అప్పటి నుంచి పూర్తి స్థాయి ఉద్యోగం మాత్రమే కాదు.. తాత్కాలిక కాంట్రాక్ట్‌ కూడా దక్కలేదని లింక్డిన్‌లో వాపోయారు. రెండు దశాబ్దాలకు పైగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, టెక్నికల్‌ లీడర్‌షిప్‌, ప్రొడక్ట్‌ డెలివరీ, టెక్నాలజీ కన్సల్టింగ్‌లో అనుభవం ఉన్నప్పటికీ ఉద్యోగం దొరక్కపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని తెలిపారు.

‘‘ఈ రోజు నాకు చాలా కష్టంగా ఉంది. ఉద్యోగం కోల్పోయి దాదాపు 12 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కొన్నిసార్లు ఇక ప్రయత్నాలు ఆపేయాలనిపిస్తుంది. కానీ నా భార్య, ఇద్దరు పిల్లలే మళ్లీ ముందుకు నడిపిస్తున్నారు’’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఉద్యోగం కోసం తాను చేయని ప్రయత్నం లేదని ఎడ్వర్డ్‌ చెప్పారు. రెజ్యూమేను పలుసార్లు మార్చానన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విధానాన్ని మార్చానని, తెలిసినవారిని సంప్రదించానని, నేరుగా కంపెనీలను సంప్రదించానని వివరించారు. అయినప్పటికీ ఫలితం మాత్రం లేదన్నారు. ‘‘గోడకు తల కొట్టుకుంటున్నట్టే అనిపిస్తోంది. ఎన్ని మార్గాలు ప్రయత్నించినా ఫలితం మాత్రం ఒకటే’’ అని తన బాధను వ్యక్తం చేశారు.

ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూడటం మాత్రమే కాకుండా, ప్రస్తుతం రెండు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను స్వయంగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. వాటిలో ఏదో ఒకటి భవిష్యత్తులో తన జీవితాన్ని మార్చే అవకాశంగా మారుతుందనే ఆశతో ఉన్నానన్నారు.

ఎడ్వర్డ్‌ పోస్ట్‌కు వేలాది మంది స్పందించారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగ మార్కెట్‌లో అనుభవజ్ఞుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌లో వేలాది దరఖాస్తుల మధ్య మంచి అభ్యర్థులు కూడా కనిపించకుండా పోతున్నారని చెప్పారు. మరికొందరు తమకు కూడా ఉద్యోగం రావడానికి 18 నెలలు పట్టిందని, చివరకు తక్కువ వేతనంతో వేరే రంగంలో చేరాల్సి వచ్చిందని తమ అనుభవాలను పంచుకున్నారు.

ఎడ్వర్డ్‌ కథ ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో మందగమనం, భారీ తొలగింపులు, నియామకాల తగ్గుదల వల్ల వేలాది మంది నిపుణులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. అందుకే, ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకునే ముందు ఉద్యోగ మార్కెట్‌ పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Edward Whitehead
Software Developer Job Market
Tech Layoffs 2024
IT Professional Career Advice
LinkedIn Viral Post
Software Engineering Experience

More Telugu News