ముద్రగడ కన్నుమూత.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, షర్మిల నివాళులు

Mudragada Padmanabham Passes Away KCR KTR Harish Rao and Sharmila Express Shock
  • కాపు వర్గాల అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన కృషి గొప్పదన్న కేసీఆర్
  • కాపు ఉద్యమ నేతగా ముద్రగడ నిలిచిపోతారన్న కేటీఆర్
  • ముద్రగడ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అన్న షర్మిల
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు చేసిన సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. 

నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడని కేసీఆర్ పేర్కొన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పని చేసిన ఆయన గొప్ప ప్రజానాయకుడని ప్రశంసించారు. కాపు వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి గొప్పదని కొనియాడారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులు, అనుబంధ కులాలకు అందించాలనే తపనతో జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు.

కాపు ఉద్యమ నేతగా ముద్రగడ నిలిచిపోతారని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని అన్నారు.

కాపు సామాజికవర్గం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు ముద్రగడ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. షర్మిల స్పందిస్తూ... కాపు నేత, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. "ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. కాపుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తిగా, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా ముద్రగడ రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా" అని పేర్కొన్నారు.
Advertisement
Mudragada Padmanabham
Kapu Movement Leader
Mudragada Padmanabham Death
KCR Condolences Mudragada
KTR Harish Rao Sharmila
Andhra Pradesh Politics

More Telugu News