ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు?: ప్రకాశ్ రాజ్
- పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ అలియాస్ జోసెఫ్
- కోర్టులు బెయిల్ ఇస్తున్నా ఇతర కేసుల్లో అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- కూటమి ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు
"అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. మళ్లీ అరెస్ట్. మీరు తప్పు చేస్తున్నారని మీకు కోర్టులు స్పష్టంగా చెప్పడం లేదా? మీ కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు" అంటూ ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. “ప్రశ్నించే వారిని అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేయడం ఎంతవరకు సాగుతుంది? కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మరో కేసు తెరిచి వేధించడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
రావణ్ ఏలూరులో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, వెంటనే సర్పవరం పోలీసులు మరో పాత కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రావణ్‌పై మొత్తం 30 కేసులు ఉన్నాయని, ఇది స్పష్టమైన ప్రతీకార చర్య అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. జనసేన కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న ఘటనను కూడా ఆయన ప్రస్తావిస్తూ... ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు.