నాకు చాలా టఫ్ బాస్ ఉన్నారు: శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్
- శ్రీసిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్
- 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని ఉద్ఘాటన
- వర్సిటీ ద్వారా 75 వేల ఉద్యోగాలను సృష్టిస్తామని వెల్లడి
- పెట్టుబడిదారులకు 3S మోడల్‌తో పూర్తి భరోసా ఇస్తున్నామని వివరణ
- ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త సీఎం టార్గెట్ అని స్పష్టం
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. "దేశ ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం ముందుండాలి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 220 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాం" అని ఆయన ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వస్తున్న నూతన విద్యా విధానం, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు దేశ విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నాయని కొనియాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారని, ఒక రాష్ట్రం మంచి పని చేస్తే మిగతా రాష్ట్రాలు పోటీపడతాయని ఆయన నమ్ముతారని లోకేశ్ తెలిపారు.
ఏపీ యువతకు వరం శ్రీసిటీ యూనివర్సిటీ
శ్రీసిటీలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు శ్రీని రాజు, రవీంద్ర సన్నారెడ్డిలను లోకేష్ అభినందించారు. ఇది కేవలం ఒక యూనివర్సిటీ ప్రారంభోత్సవం కాదని, ఉన్నత విద్యపై సరికొత్త ఆలోచనా విధానానికి పునాది అని అభివర్ణించారు.
"ఒక ఐడియాను వాస్తవరూపంలోకి తెచ్చిన శ్రీని రాజు గారికి నా అభినందనలు. ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక పెద్ద గిఫ్ట్. ప్రస్తుతం 5,000 మంది విద్యార్థులతో ప్రారంభమవుతున్నా, భవిష్యత్తులో ఈ సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతుందన్న నమ్మకం నాకుంది" అని ఆయన అన్నారు. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాకుండా, సమాజంలో ఎలాంటి మార్పు తీసుకొస్తున్నామనే దానిపైనే యూనివర్సిటీల విలువ ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యారంగంలో వినూత్న సంస్కరణలు
భారతదేశంలో ఉన్నత విద్యలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని లోకేశ్ నొక్కి చెప్పారు. శ్రీసిటీ యూనివర్సిటీలో ప్రవేశపెట్టిన 'వర్క్-స్టడీ' మోడల్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. దీనిని తాను 'లెగ్' (LEG - Learn, Earn, Graduate) మోడల్ అని పిలుస్తానని, అంటే నేర్చుకుంటూ, సంపాదిస్తూ, పట్టభద్రులు కావడమని వివరించారు.
"డిగ్రీ రాగానే చదువు ఆగిపోకూడదు. జీవితాంతం నేర్చుకోవడం అక్కడే మొదలవుతుంది. ఈ లెగ్ మోడల్ మన విద్యా వ్యవస్థ రూపురేఖలనే మార్చేస్తుంది" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులను కేవలం పట్టభద్రులుగా కాకుండా, సమస్యలను పరిష్కరించేవారిగా, నిరంతర అభ్యాసకులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
75 వేల ఉద్యోగాలే లక్ష్యం
శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా 2029 నాటికి 75 వేల ఉద్యోగాలు సృష్టించడమే తన లక్ష్యమని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇప్పటికే శ్రీసిటీలో 31 దేశాలకు చెందిన 200కు పైగా కంపెనీలు ఉన్నాయని, ఈ యూనివర్సిటీ రాకతో పారిశ్రామిక అనుసంధానం మరింత బలపడుతుందని అన్నారు. ఇక్కడి పారిశ్రామిక వాతావరణం భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోందని, దీని వెనుక శ్రీని రాజు, రవి సన్నారెడ్డిల కృషి అమోఘమని కొనియాడారు. కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు 3S భరోసా
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి తమ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం '3S' మోడల్‌ను (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) అనుసరిస్తున్నామని తెలిపారు.
"ఒకసారి మేము ప్రాజెక్టుకు ఓకే చెప్పామంటే, అది ఇక మీది కాదు, మా సొంత ప్రాజెక్టుగా భావిస్తాం. దానికి ఈ యూనివర్సిటీ ఫైల్‌ను క్లియర్ చేసిన విధానమే ఉదాహరణ. నేను రష్యా పర్యటనలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఫైల్‌ను క్లియర్ చేశాను" అని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కారానికి, వారి వ్యాపార విస్తరణకు మద్దతుగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఏఐ, స్టార్టప్‌లతో నవశకం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం, స్టార్టప్‌ల ఆవశ్యకతను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ అనేది ఉద్యోగాలను తీసివేసేది కాదని, మానవ సామర్థ్యాన్ని పెంచే ఒక సహాయక సాధనమని స్పష్టం చేశారు. తాము రాజకీయాల్లో కూడా ఏఐను వాడుతున్నామని, తమ పార్టీకి 2 టెరాబైట్ల డేటాతో డిజిటల్ లైబ్రరీ ఉందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఒక ఫ్యామిలీ, ఒక ఎంట్రప్రెన్యూర్' అనే లక్ష్యాన్ని నిర్దేశించారని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ఆయన ఆశయమని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో శ్రీసిటీ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించాలని, సక్సెస్ స్టోరీలను సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.