భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్‌ పేరు మార్పుతో చర్చ

Is US strategy towards India changing Discussion over Command name change
  • ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ను ‘పసిఫిక్‌ కమాండ్‌’గా మార్పు
  • కమాండ్‌ వెబ్‌సైట్‌లో తప్పుగా చూపిన భారత్‌ మ్యాప్‌పై వివాదం
  • పీఓకేను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంపై విమర్శలు
  • 2018లో ఇండో-పసిఫిక్‌ కమాండ్‌గా పేరు మార్చిన అమెరికా
  • పేరు మాత్రమే మారుతోందని, బాధ్యతల్లో మార్పులేదని స్పష్టీకరణ
అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన కీలక సైనిక కమాండ్‌ పేరును మార్చడం, అదే సమయంలో భారత్‌కు సంబంధించిన తప్పు మ్యాప్‌ను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా కొనసాగుతున్న సంస్థను మళ్లీ ‘పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే ఆ కమాండ్‌ వెబ్‌సైట్‌లో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను (పీఓకే) పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం వివాదానికి దారితీసింది.

2018లో అప్పటి అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మ్యాటిస్‌ ఈ కమాండ్‌కు ‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా పేరు మార్చారు. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సందేశాన్ని అప్పట్లో అమెరికా పంపింది. ఇప్పుడు ఆ పేరును తొలగించి మళ్లీ పాత పేరైన ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’ను తీసుకొచ్చింది.

ఈ నిర్ణయం వెనుక ఎలాంటి వ్యూహాత్మక మార్పులు లేవని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. కమాండ్‌ చరిత్ర, వారసత్వాన్ని గౌరవించేందుకే ఈ పేరు మార్పు చేపట్టినట్లు వెల్లడించింది. పసిఫిక్‌ ప్రాంతంలో సేవలందించిన సైనికుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొంది.

అధికారుల ప్రకారం పేరు మాత్రమే మారుతోంది. కమాండ్‌ బాధ్యతలు, వ్యూహాత్మక లక్ష్యాలు, కార్యకలాపాల పరిధిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారత్‌ పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించిన కార్యకలాపాల పరిధి యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. మిత్రదేశాలతో కలిసి స్వేచ్ఛాయుత, భద్రమైన సముద్ర ప్రాంతాల లక్ష్యానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ హయాంలో ఈ కమాండ్‌ ఏర్పాటైంది. అమెరికా సైనిక వ్యవస్థలో అత్యంత పురాతన, అతిపెద్ద యూనిఫైడ్‌ కమాండ్లలో ఇది ఒకటి. కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి కీలక ఘట్టాల్లో ఈ కమాండ్‌ ప్రధాన పాత్ర పోషించింది. ప్రకృతి విపత్తులు, మానవతా సహాయ కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పనిచేసింది.

2018లో ‘ఇండో-పసిఫిక్‌’ అనే పదాన్ని పేరులో చేర్చడాన్ని భారత్‌ సహా అనేక దేశాలు కీలక సంకేతంగా చూశాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ ప్రాంత భద్రతా అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయనే అమెరికా ఆలోచనకు అది ప్రతీకగా భావించారు. భారత్‌-అమెరికా రక్షణ సహకారం పెరగడంలోనూ ఈ కమాండ్‌ ముఖ్య వేదికగా నిలిచింది.
Go Back to Shorts
US Indo-Pacific Command
India US defense relations
US Pacific Command name change
POK map controversy
Pentagon India strategy
Indo-Pacific security

More Telugu News