తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్
- జూన్ 2న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ
- పరస్పర గౌరవంతో ముందుకెళ్లడమే తన విధానమంటూ స్పష్టీకరణ
- ఎక్స్ వేదికగా పోస్ట్.. గతంలోని వీడియోను పంచుకున్న జనసేనాని
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదంపై ఆయన గురువారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల తన వైఖరి రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటివరకూ మారలేదని పేర్కొన్నారు. విభజన తర్వాత తాను 'సెక్షన్ 8' అమలును వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, స్వయంపాలనా హక్కును దెబ్బతీస్తుందనే భావనతోనే ఆనాడు ఆ విధంగా స్పందించానని వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే యంత్రాంగాలు ఉండాలని తాను సూచించినట్లు తెలిపారు. తన పూర్వ వైఖరిని ధ్రువీకరించే పాత వీడియో క్లిప్‌ను కూడా ఆయన ఈ పోస్టుకు జతచేశారు.
గతంలో జూన్ 2న గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పవన్ కల్యాణ్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా, తెలంగాణలో 2029 అసెంబ్లీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. అయితే, ‘అతివాద ప్రాంతీయత’పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.
పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు స్పందిస్తూ.. సుదీర్ఘ ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఇక్కడి వ్యవహారాల్లో ఇతరుల జోక్యం తగదని హితవు పలికారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తాజాగా వివరణ ఇచ్చారు.