ఇన్‌స్టాగ్రామ్ వేదిక మాత్రమే, బ్యాలెట్ బాక్స్ కాదు.. కాక్రోచ్ పార్టీపై శశి థరూర్
- యువత ఆందోళనలు సమంజసమేనని శశిథరూర్ మద్దతు
- వ్యవస్థలో ఉంటూనే మార్పు కోసం పోరాడాలని పిలుపు
- ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచన
- సోషల్ మీడియా నిరసనలతోనే సమస్యలు తీరవని హితవు
- కాక్రోచ్ జనతా పార్టీపై థరూర్ వ్యాసం
పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల వల్ల యువత ఎదుర్కొంటున్న నిరాశ, కోపం చాలా సమంజసమైనవని థరూర్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ కోపాన్ని కేవలం ఆన్‌లైన్ హేళనలకే పరిమితం చేయకుండా చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గాల్లో ఉపయోగించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడం, ప్రజాప్రతినిధులను నిలదీయడం వంటి పనుల ద్వారా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావచ్చని సూచించారు. నిర్దిష్టమైన డిమాండ్లతో పోరాడినప్పుడే మీడియా కూడా సమస్యలతో పాటు పరిష్కారాలను చూపిస్తుందని పేర్కొన్నారు.
యువత తమ నిరసనను కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని థరూర్ పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు, న్యాయ నిపుణులు, పాలసీ సంస్థలతో కలిసి పనిచేసి గట్టిగా లాబీయింగ్ చేయాలన్నారు. ‘‘మీ కోపం నిరాశగా మారిపోనివ్వకండి. మీ సంఖ్యా బలం, డిజిటల్ పరిజ్ఞానంతో దీర్ఘకాలిక మార్పు కోసం పోరాడండి’’ అని ఆయన ముగించారు. నిరుద్యోగం, పరీక్షల వివాదాలపై అభిజిత్ దిప్కే అనే యువకుడు సోషల్ మీడియాలో సరదాగా ప్రారంభించిన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది యువతను ఆకర్షిస్తోంది.