హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్
- అది అంతర్జాతీయ జలభాగమని, ఆధిపత్యం చెల్లదని స్పష్టీకరణ
- ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీశామన్న ట్రంప్
- ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వ్యాఖ్య
- దౌత్యమే మొదటి ప్రాధాన్యమన్న అమెరికా విదేశాంగ మంత్రి
ఇటీవల అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో పాటు కఠినమైన ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ సైనిక, ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. "మా దెబ్బకు వారి రక్షణ వ్యవస్థ కుప్పకూలింది. అందుకే దిగివచ్చి చర్చలకు కూర్చున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో 250 శాతం ద్రవ్యోల్బణం ఉంది, వారి కరెన్సీకి విలువ లేకుండా పోయింది" అని ట్రంప్ వివరించారు. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ అణ్వస్త్రాలు పొందకుండా అడ్డుకుంటామని పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ తమ వ్యూహం 'గరిష్ఠ ప్రాణాంతకం'గా ఉందని, ప్రస్తుతం ఇరాన్ నౌకాదళం పూర్తిగా పర్షియన్ గల్ఫ్ అడుగు భాగానికి చేరిందని అన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ దౌత్యానికే తమ మొదటి ప్రాధాన్యమని, అయితే అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇరాన్‌తో తుది ఒప్పందం పశ్చిమాసియాలోని విస్తృత దౌత్యంతో ముడిపడి ఉంటుందని 'అబ్రహం ఒప్పందాల' పరిధిలోకి సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు కూడా రావాలని ట్రంప్ ఆకాంక్షించారు.