ఐదేళ్లు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్‌పై సోమిరెడ్డి ఫైర్

YS Jagan Mohan Reddy Why Silent for 5 Years Somireddy Fires
  • వైఎస్ మృతిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న సోమిరెడ్డి
  • సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్న
  • కాంగ్రెస్ హయాంలోనే సీబీఐ దాన్ని ప్రమాదంగా తేల్చిందన్న సోమిరెడ్డి 
  • జగన్ మాటలు విని వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యాఖ్య
  • చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్ చరిత్ర లేదని స్పష్టీకరణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై 17 ఏళ్ల తర్వాత జగన్ ఇప్పుడు చంద్రబాబుపై అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అనుమానాలు నివృత్తి చేసుకోకుండా జగన్ గాజులు తొడుక్కుని కూర్చున్నారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. "వైఎస్ చనిపోయినప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై ఇప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే సీబీఐ విచారణకు ఆదేశిస్తే, అది ప్రమాదమని స్పష్టంగా తేల్చింది. అప్పుడు నోరు మెదపని జగన్, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం చూసి సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు," అని అన్నారు. 

కడపకు చెందిన పార్థసారథి రెడ్డి మీడియా సాక్షిగా వైఎస్ కుటుంబం చేసిన ఘోరాలను ఏకరువు పెట్టారని, ఆ కుటుంబ నేరాలకు ఆయనే ప్రథమ సాక్షి అని సోమిరెడ్డి పేర్కొన్నారు. "చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం కానీ, నేర చరిత్ర కానీ లేవు. ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి," అని సోమిరెడ్డి హితవు పలికారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను పట్టుకోలేని జగన్, ఇప్పుడు వైఎస్ మృతిపై మాట్లాడటం వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
 
Go Back to Shorts
YS Jagan Mohan Reddy
Somireddy Chandramohan Reddy
TDP
Chandrababu Naidu
YSR Death
Andhra Pradesh Politics
YSR Congress
YS Vivekananda Reddy Murder Case
Parthasarathi Reddy
Political Allegations

More Telugu News