ఐదేళ్లు ప్రజల్ని బాది.. ఇప్పుడు ధర్నాలంటూ డ్రామాలా?: వైసీపీపై సోమిరెడ్డి ఫైర్

Somireddy Fires at YSRCP Over Petrol Price Protests
  • పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు ఓ పెద్ద డ్రామా అని విమర్శించిన సోమిరెడ్డి
  • జగన్ హయాంలో దేశంలోనే అత్యధిక ధరలతో ప్రజలను దోపిడీ చేశారని ఆరోపణ
  • మద్యం ధరలు పెంచి, కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు
  • వైసీపీ నిరసనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, సొంత పార్టీ నేతలే అసహనంగా ఉన్నారని వ్యాఖ్య
  • జగన్‌పై ఉన్న అవినీతి కేసుల విచారణ వేగవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్న ధర్నాలు ఓ పెద్ద డ్రామా అని, ఐదేళ్ల పాటు ప్రజల జేబులు గుల్ల చేసి ఇప్పుడు రోడ్డెక్కడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్రస్థాయిలో దోపిడీ జరిగిందంటూ ధ్వజమెత్తారు. 

"జగన్ సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. అడ్డగోలుగా రోడ్ సెస్ వేసి, వ్యాట్ పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధరలు పెంచిన మాట వాస్తవమే అయినా, దాన్ని పట్టుకుని మీరిప్పుడు ధర్నాలు చేస్తారా?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

 జగన్ హయాంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112 ఉంటే, పక్కనే ఉన్న కర్ణాటకలో రూ. 101 మాత్రమే ఉండేదని, అంటే లీటర్‌కు రూ. 11 చొప్పున ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. "నేను బెంగళూరు వెళ్లినప్పుడు, తిరిగొస్తూ కర్ణాటక బార్డర్‌లోనే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకునేవాడిని. 50 లీటర్లకు రూ. 550 ఆదా అయ్యేవి. అంత దారుణంగా రాష్ట్రాన్ని లూటీ చేశారు" అని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఒక్క పైసా కూడా పెంచలేదని, జగన్ పెంచిన పాత ధరల పాపాన్ని మోస్తూనే ఇప్పుడు వైసీపీ సిగ్గులేకుండా ధర్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

మద్యంపై 'జగనన్న టాక్స్' పేరుతో విపరీతంగా ధరలు పెంచి, నాసిరకం బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని సోమిరెడ్డి ఆరోపించారు. ధరలు పెంచితే తాగడం తగ్గిస్తారనే వింత వాదనతో జనాన్ని బాదారని, పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోకుండా కఠిన ఆంక్షలు విధించారని మండిపడ్డారు. "మేం చెప్పిన మందే తాగాలి అంటూ కల్తీ మద్యం అమ్మి, గత ఐదేళ్లలో 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి, లక్షల మంది అనారోగ్యం పాలు కావడానికి కారణమయ్యారు. ఇన్ని అరాచకాలు చేసి ఏ ముఖం పెట్టుకుని రోడ్ల మీదకు వస్తున్నారు?" అని నిలదీశారు.

రూ. 43,000 కోట్ల అవినీతి ఆరోపణలతో 13 సీబీఐ కేసుల్లో 15 ఏళ్లుగా జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారని, ఈ కేసుల విచారణ వేగవంతమై న్యాయం జరగాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, వంద మందిని కూడా సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. "ధర్నాల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలే 'ధరలు పెంచింది మనమే కదా, ఇప్పుడీ ధర్నాలేంటి?' అని గుసగుసలాడుకుంటున్నారు. ఇదీ వైసీపీ ప్రస్తుత పరిస్థితి" అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Somireddy Chandramohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Petrol Price Hike
Diesel Price Hike
Jagan Mohan Reddy
TDP
Road Tax
Liquor Prices
Corruption Charges

More Telugu News