వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- సగటున లీటర్‌పై 90 పైసలు పెంపు
- అంతర్జాతీయ మార్కెట్లో 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్
- హైదరాబాద్‌లో 99 పైసలు పెరిగి రూ.111.88కి చేరిన పెట్రోల్
- ఢిల్లీలో రూ.98.64, ముంబయిలో రూ.107.59కి చేరిన పెట్రోల్
- పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్లే చమురు మార్కెట్లో ఒడిదొడుకులు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఇటీవలే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ భారం మరువక ముందే ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి.
తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటున లీటర్ పెట్రల్, డీజిల్‌పై 90 పైసలు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ఈ పెంపులో స్వల్ప తేడాలుంటాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 99 పైసలు పెరిగి రూ.111.88కి చేరింది. డీజిల్ ధర సైతం 99 పైసలు ఎగబాకి రూ.99.95గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి రూ.98.64కి చేరింది. అలాగే డీజిల్ ధర 91 పైసలు పెరిగి రూ.91.58గా నమోదైంది. కోల్‌కతాలో 96 పైసలు పెరగడంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.109.70కి చేరింది. ముంబయిలో 91 పైసలు పెరిగి రూ.107.59కి, చెన్నైలో 82 పైసలు పెరిగి రూ.104.49కి పెట్రోల్ రేట్లు చేరుకున్నాయి.
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. కోల్‌కతా, ముంబయి నగరాల్లో లీటర్ డీజిల్‌పై 94 పైసల చొప్పున పెరిగింది. దీనితో కోల్‌కతాలో డీజిల్ ధర రూ.96.07కి, ముంబయిలో రూ.94.08కి చేరింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది. ఈ ప్రభావమే దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది.