నేటి మ్యాచ్‌లో ధోనీ ఆడకపోవడమే మంచిది: గవాస్కర్
- ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ
- ఈరోజు జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడతాడంటూ వార్తలు
- ఈనాటి మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగితే జట్టుకు రిస్క్ అన్న సన్నీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈరోజు చెపాక్ స్టేడియంలో తలపడనున్నాయి. చెన్నైకి ఇదే చివరి హోమ్ మ్యాచ్. దీంతో, గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేస్తాడని, ఆపై రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.
ఈ ప్రచారంపై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కండరాల గాయం వల్ల ఏడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ, రియల్ టైమ్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగడం జట్టుకు పెద్ద రిస్క్ అని అభిప్రాయపడ్డాడు. అభిమానిగా తాను కూడా ధోనీ ఆటను చూడాలని కోరుకుంటున్నప్పటికీ, ఫిట్నెస్ లేని కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతడు ఆడకపోవడమే మంచిదని సూచించాడు. కీలక సమయంలో చెన్నై జట్టు కూర్పును మార్చకపోవచ్చని అంచనా వేశాడు. అయితే అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ధోని మైదానంలోకి దిగితే, అది అభిమానులందరికీ ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అవుతుందని సన్నీ పేర్కొన్నాడు.