ఆ సెంచరీ తర్వాత నాకంటే అతడే అర్హుడు అనిపించింది: సంజూ శాంసన్

Sanju Samson Feels Ishan Kishan Deserved His Place After Century
  • భారత జట్టులో స్థానం కోసం ఉన్న పోటీపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు 
  • త‌న‌ స్థానం కోసం ఇషాన్ కిష‌న్‌ వస్తున్నాడని ముందే గ్రహించాన‌న్న‌ సంజూ
  • తిరువనంతపురంలో ఇషాన్ సెంచరీ త‌ర్వాత‌ తనకంటే అతడే జట్టులో క‌రెక్ట్ అనుకున్నాన‌ని వెల్ల‌డి
  • గత రెండేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్, కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చాడని ప్రశంస‌
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమని అంటుంటారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ఈ పోటీపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సహచరుడు ఇషాన్ కిషన్ నుంచి ఎదురైన పోటీ గురించి మనసు విప్పి మాట్లాడాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్, తన స్థానం కోసం వస్తున్నాడని తాను ముందే గ్రహించానని సంజూ అంగీకరించాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను సంజూ గుర్తుచేసుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులోకి పునరాగమనం చేయగా, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినిచ్చారు. టోర్నీ ఆరంభంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడిన సంజూ శాంసన్‌ను మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు పక్కనపెట్టారు. అతని స్థానంలో అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేశాడు.

ఈ పోటీపై ఒక పాడ్‌కాస్ట్‌లో సంజూ శాంసన్ మాట్లాడుతూ... "నిజం చెప్పాలంటే, ఇషాన్ కిషన్ ఎక్కడి నుంచో జట్టులోకి దూసుకొచ్చాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. తన జట్టు ఝార్ఖండ్‌కు ఛాంపియన్‌షిప్ అందించాడు. అతని కథ కూడా గొప్పది. గత రెండేళ్లుగా జట్టుకు దూరమైన అతను, దేశవాళీ క్రికెట్‌లో తీవ్రంగా శ్రమించి తిరిగి తన మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. అతను పరుగులు చేయడం ప్రారంభించినప్పుడే, నా స్థానం కోసం వస్తున్నాడని నాకు అనిపించింది. ఈ విషయాన్ని నేను కెమెరా ముందు ఒప్పుకుంటున్నాను" అని తెలిపాడు.

ముఖ్యంగా ప్రపంచకప్‌కు ముందు తిరువనంతపురంలో ఇషాన్ సెంచరీ సాధించినప్పుడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో సంజూ వివరించాడు. "ఆ సెంచరీ తర్వాత, 'సంజూ, ఇప్పుడు ఈ స్థానాన్ని అతనికి వదిలేయ్ బాస్. నీకంటే అతడే ఎక్కువ అర్హుడు' అని నాకు నేనే చెప్పుకున్నాను. నీకు అవకాశాలు వచ్చినా పరుగులు చేయలేదు, కానీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక ఆటగాడు సిద్ధంగా ఉన్నాడు అనిపించింది. అతను ప్రతిదీ సరిగ్గానే చేసి జట్టులోకి వచ్చాడు" అని సంజూ పేర్కొన్నాడు.

అయితే, ఈ ఆరోగ్యకరమైన పోటీ భారత జట్టుకు మేలు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ముగ్గురూ అర్ధ సెంచరీలతో చెలరేగి, భారత్‌కు మూడోసారి టీ20 ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు.
Go Back to Shorts
Sanju Samson
Ishan Kishan
Indian Cricket Team
T20 World Cup
Cricket
Mushtaq Ali Trophy
Abhishek Sharma
Shubman Gill
Team India
Domestic Cricket

More Telugu News