సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్
- తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఘోర పరాజయం
- రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే
- తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ కు పంపించిన స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్కు పంపించారు. మరోవైపు, తాజా ఫలితాల ప్రకారం ఏ పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.
72 స్థానాలు సాధించిన డీఎంకే కూటమి, 53 స్థానాల్లో నిలిచిన అన్నాడీఎంకేలను కాదని, మెజారిటీకి అవసరమైన మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టే పనిలో విజయ్ నిమగ్నమయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్న విజయ్... ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అతిపెద్ద పార్టీగా ఉన్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరనున్నారు.