కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్
- ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయన్న కేటీఆర్
- హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రజలు గెలిచారన్న కేటీఆర్
- భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని వ్యాఖ్య
హైకోర్టు తీర్పుతో ఈరోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు అన్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో పారుతున్న ప్రతి నీటిబొట్టు కేసీఆర్ చేసిన కృషివల్లే వచ్చిందని అన్నారు. తెలంగాణ భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని అన్నారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరికీ అసలు విషయం తెలిసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కచ్చితంగా వరప్రదాయిని అన్నారు. రూ.94 వేల కోట్లు ఖర్చయితే రూ.1 లక్ష కోట్లు అని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదని, మూడు బ్యారేజీలు అని తెలిపారు. కాంగ్రెస్ చేసిన కుట్రల వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆరోపించారు. రాష్ట్రంలో చెక్ డ్యాంలు బాంబులు పెట్టి పేలుస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు.