ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త... హర్మూజ్ ను పూర్తిగా తెరిచామంటూ ప్రకటన

Iran Announces Full Opening of Hormuz Strait to Global Nations
  • హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్
  • లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగినంత కాలం ఈ నిర్ణయం అమలు
  • నిర్ణీత మార్గంలోనే నౌకలు ప్రయాణించాలని స్పష్టం చేసిన ఇరాన్
  • ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అధికారిక ప్రకటన
ఇటీవల కాలంలో చమురు, ఎల్పీజీ సంక్షోభంలో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ తియ్యని కబురు వినిపించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ ను పూర్తిగా తెరిచినట్టు వెల్లడించింది. లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ కొనసాగినంత కాలం, ఈ జలసంధి గుండా అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.

"లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో, మిగిలిన కాల్పుల విరమణ కాలానికి హర్మూజ్ జలసంధి గుండా అన్ని వాణిజ్య నౌకల ప్రయాణానికి మార్గం పూర్తిగా తెరిచి ఉంటుంది" అని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో హర్మూజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తాజా నిర్ణయం వాణిజ్య వర్గాలకు ఊరటనిస్తోంది. అయితే, నౌకలు తమ దేశ మారిటైమ్ సంస్థ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలనే షరతును ఇరాన్ విధించింది. లెబనాన్‌లో శాంతియుత వాతావరణం కొనసాగేలా చూసే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Iran
Hormuz Strait
Strait of Hormuz
Oil Crisis
Lebanon
Seyyed Abbas Araghchi
International Trade
Shipping
Middle East

More Telugu News