సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
- జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలో ఐదుగురు మృతి
- మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన జగన్
- పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నిఘా ఉండాలని సూచన
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన ఘోర ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలచివేసిందని అన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగన్... గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, పేలుడు ధాటికి ఇళ్లు కూడా ధ్వంసమవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పేలుడు పదార్థాల నిల్వపై ప్రభుత్వం కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, నిబంధనలు అతిక్రమించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడి, తగిన ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ శ్రేణులకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు.