చైనాకు ట్రంప్ ‘సీరియస్’ వార్నింగ్
- ఇరాన్‌కు ఆయుధాలిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక
- సైనిక చర్య, ఆర్థిక ఆంక్షలు తప్పవని స్పష్టం చేసిన అమెరికా
- ఆరోపణలను ఖండించిన చైనా.. ఆయుధాలు పంపలేదని వివరణ
‘‘మా శత్రువులకు మీరు ఆయుధాలు ఇస్తే, మేం మిమ్మల్ని వదిలిపెట్టబోం’’ అని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాను అడ్డుకోవాలన్న ఇరాన్ ప్రయత్నాలకు సహకరించే దేశాలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ఆయన సంకేతాలిచ్చారు.
ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే చైనా కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ అమలులో ఉన్న సమయంలో ఇరాన్ కు చైనా సైనిక సహకారం అందించడం తమ బలగాలకు ముప్పుగా పరిణమించనుందని అమెరికా భావిస్తోంది.
అయితే, ట్రంప్ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. తమపై నిరాధార నిందలు వేస్తున్నారని పేర్కొంది. ఈమేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. పశ్చిమాసియా సంక్షోభంలో పాల్గొన్న ఏ దేశానికీ తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని వివరించింది. సెన్సేషనలిజం కోసమే కొన్ని మీడియా సంస్థలు తమపై నిరాధార ఆరోపణలతో కథనాలు ప్రసారం చేస్తున్నాయని విమర్శించింది.