Ganta Srinivasa Rao: ఇంత జరిగినా జగన్ తీరు మారలేదు: గంటా శ్రీనివాసరావు
పార్లమెంట్ సాక్షిగా అమరావతికి రాజధానిగా చట్టబద్ధత లభించడాన్ని స్వాగతిస్తూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్, అధికారం రాగానే మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును ఐదేళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా జగన్ తీరు మారలేదని, కనీసం రాజధాని తీర్మానం కోసం జరిగిన అసెంబ్లీ సమావేశానికి కూడా ఆయన హాజరుకాకపోవడం దారుణమని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని గంటా అన్నారు. ఏప్రిల్ 15లోపు ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ సంస్థకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతోందని ఆయన ఒక కీలక సమాచారాన్ని వెల్లడించారు. అమరావతి, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఇకపై ఎవరూ అమరావతిని కదిలించలేరని, ఇది ఆంధ్రుల కలల రాజధానిగా అభివృద్ధి చెందుతుందని గంటా స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు రైతులు చేసిన పోరాటం వృథా కాలేదని, చివరకు న్యాయమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు.