Sujana Chowdary: అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితికి నేటితో తెరపడింది: సుజనా చౌదరి

Sujana Chowdary Uncertainty over Amaravatis future ends
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు - 2026'ను నేడు లోక్ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమరావతి భవిష్యత్తుపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లయింది.

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక విజయమని, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు దక్కిన గొప్ప గౌరవమని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం ద్వారా భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి కేంద్రం ముగింపు పలికింది. ఇది అపూర్వ విజయం" అని పేర్కొన్నారు.

కోట్లాది ఆంధ్రుల స్వప్నానికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సుజనా చౌదరి తన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని కోసం ప్రాణ త్యాగాలు చేసిన రైతులు, పోరాడిన ప్రజల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Sujana Chowdary
Amaravati
Andhra Pradesh
AP Reorganisation Act
Andhra Pradesh Reorganisation Act 2026
AP Capital
Narendra Modi
Amit Shah
BJP
Andhra Farmers

More Telugu News