Vijaypat Singhania: పారిశ్రామిక దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా అస్తమయం

Vijaypat Singhania Raymond Group Former Chairman Passes Away
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ వస్త్ర బ్రాండ్ రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత విజయ్‌పత్ సింఘానియా (87) కన్నుమూశారు. నిన్న సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు.

విజయ్‌పత్ సింఘానియా కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా, సాహసవంతుడైన ఏవియేటర్‌గానూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1988లో మైక్రోలైట్ విమానంలో లండన్ నుంచి న్యూఢిల్లీకి ఒంటరిగా ప్రయాణించి రికార్డు సృష్టించారు. 2005లో హాట్ ఎయిర్ బెలూన్‌లో దాదాపు 69వేల అడుగుల ఎత్తుకు వెళ్లి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం 2006లో దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. 1980 నుంచి 2000 వరకు ఆయన రేమండ్ గ్రూప్‌కు చైర్మన్‌గా సేవలు అందించారు.

కొన్నేళ్ల క్రితం కంపెనీ యాజమాన్య హక్కులను తన కుమారుడికి బదిలీ చేసిన తర్వాత తండ్రీకొడుకుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తడం గమనార్హం. అయితే, ఆ తర్వాత వారు సమస్యలను పరిష్కరించుకున్నట్లు సమాచారం. కాగా, ఆయన అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. సింఘానియా ఒక దార్శనిక నాయకుడని, ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కుటుంబం నివాళులర్పించింది.
 
Go Back to Shorts
Vijaypat Singhania
Raymond Group
Gautam Singhania
Industrialist
Aviation
Padma Bhushan
London to New Delhi Flight
Hot Air Balloon Record
Indian businessman
Business family

More Telugu News