Muralidhar Deshpande: ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్' అన్న ప్రొఫెసర్... బెంగళూరులో తీవ్ర దుమారం

Bangalore Professor Suspended for Calling Muslim Student Terrorist
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరులోని ఓ ప్రఖ్యాత ప్రైవేట్ యూనివర్సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్లాస్‌రూమ్‌లో ఓ ముస్లిం విద్యార్థిని 'ఉగ్రవాది' అంటూ ఓ ప్రొఫెసర్ పలుమార్లు సంబోధించడం కలకలం రేపింది. ఆ ప్రొఫెసర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో పాటు పలువురి నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

వివరాల్లోకి వెళితే, బనశంకరి రింగ్ రోడ్ క్యాంపస్‌లో మార్చి 24న ఈ సంఘటన జరిగింది. ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే, అఫాన్ అనే ముస్లిం విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని దాదాపు 60 మంది విద్యార్థుల ముందు 13 సార్లు 'ఉగ్రవాది' అని పిలిచినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, "నీలాంటి వాళ్ల వల్లే ఇరాన్ యుద్ధం వచ్చింది" "ట్రంప్ నిన్ను తీసుకెళతాడు," "మీరంతా మూర్ఖులు, నరకానికి పోతారు" వంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేసి క్లాస్‌లో భయానక వాతావరణం సృష్టించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనను ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. విద్యాసంస్థలో మత వివక్ష, విద్వేష ప్రసంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు, కీలక ఆధారంగా ఉండే క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను డిలీట్ చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. బాధితుడికి మద్దతుగా మాట్లాడిన కొంతమంది విద్యార్థులను "క్లాస్‌లో మాట్లాడుతున్నారనే" కారణంతో సస్పెండ్ చేశారని కూడా సమాచారం.

ప్రొఫెసర్ తన తప్పును అంగీకరిస్తూ కాలేజీ యాజమాన్యానికి రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పినప్పటికీ, బాధిత విద్యార్థికి నేరుగా క్షమాపణ చెప్పలేదని తెలుస్తోంది. ఆయన తరఫున డిపార్ట్‌మెంట్ హెడ్ క్షమాపణ చెప్పారని, విద్యార్థిపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనను "మత విద్వేష ప్రసంగం"గా పేర్కొంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ యూఐ) ఫిర్యాదు చేసింది.

తీవ్ర వ్యతిరేకత రావడంతో, యూనివర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్ దేశ్‌పాండేను సస్పెండ్ చేసి, ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు ప్రకటించింది. విద్యాసంస్థల్లో ఇలాంటి వివక్ష పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Muralidhar Deshpande
Bangalore University
Professor Suspended
Muslim Student
Islamophobia
Hate Speech
Student Protest
Religious Discrimination
Karnataka News
Private University

More Telugu News