Nara Bhuvaneswari: చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నారు: కుప్పంలో నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Says Chandrababu Has Solid Plans for Kuppam
షార్ట్స్‌లో చూడండి
రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికోసం ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తన నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఆమె పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం, రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఈ పర్యటనలో భాగంగా తొలుత శాంతిపురంలోని నివాసంలో స్థానిక టీడీపీ నేతలతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబాన్ని, ఇతర అనారోగ్య సమస్యలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామకుప్పంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో ఆమె వారితో కలిసి కిలోమీటరు దూరం నడిచారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల ఆకలి తీర్చిన మహనీయుడని కొనియాడారు. దేశంలోనే మొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, సంజీవని ఆరోగ్య పథకం వంటి హామీలను అమలు చేస్తున్నారని వివరించారు. హంద్రీనీవా జలాలను కుప్పానికి తీసుకొచ్చి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని, పరిశ్రమల రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Kuppam
NTR Memorial Trust
Andhra Pradesh Politics
TDP
Anna Canteen
Handri Neeva
AP Development
NTR Statue

More Telugu News