Sita Rama Kalyanam: వందేళ్ల భక్తి.. భద్రాద్రి రాములోరి కల్యాణానికి సికింద్రాబాద్ కుటుంబం అపూర్వ సేవ

Jayaraju Family Continues 100 Year Tradition for Bhadrachalam Kalyanam
షార్ట్స్‌లో చూడండి
భద్రాద్రి దివ్యక్షేత్రం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జగదభిరాముడి పెళ్లి వేడుకకు కీలకమైన పట్టువస్త్రాలు సిద్ధమయ్యాయి. ఈ వస్త్రాల తయారీ వెనుక వందేళ్ల భక్తి, మూడు తరాల సేవ, ఓ అరుదైన సంప్రదాయం దాగి ఉంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ చేనేత కుటుంబం భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా మగ్గాన్ని ఏర్పాటు చేసి స్వామి, అమ్మవార్ల కోసం వస్త్రాలను రూపొందించింది.

వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్‌కు చెందిన చేనేత కళాకారుడు ఎస్.ఎస్. జయరాజు కుటుంబం గత వంద సంవత్సరాలుగా, మూడు తరాలుగా భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలను సమర్పిస్తోంది. గత ఐదేళ్లుగా ప్రభుత్వ అధికారిక అనుమతితో ఈ సేవను కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయంలో భాగంగా శ్రీరామనవమికి కొన్ని వారాల ముందు భద్రాచలం చేరుకొని, ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మగ్గంపై వస్త్రాలను నేస్తారు. ఈ ఏడాది కూడా గత రెండు వారాలుగా జయరాజు ఆధ్వర్యంలో నిపుణులైన కార్మికులు పోచంపల్లి శైలిలో అద్భుతమైన పట్టువస్త్రాలను సిద్ధం చేశారు.

ఈసారి సుమారు రూ.2 లక్షల వ్యయంతో వస్త్రాలను రూపొందించారు. సీతమ్మ తల్లి కోసం రెండు పట్టు చీరలు, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి కోసం ఆరు జతల పంచెలు, అంగవస్త్రాలను తయారుచేశారు. ముఖ్యంగా 4800 దారాలతో నేసిన ఏడు రంగుల పట్టుచీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆరున్నర మీటర్ల పొడవున్న ఈ చీర అంచుపై హంసలు, ఏనుగులు, జింకలు, కొబ్బరిచెట్ల బొమ్మలను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిన్న‌టితో నేత పనులు పూర్తి కాగా, ఈరోజు (గురువారం) వాటిని ఆలయ అధికారులకు అధికారికంగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ... "మా తాతల కాలం నుంచి ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది. నేను ఉన్నంతవరకు, నా తర్వాతి తరం కూడా ఈ సేవను కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని తన భక్తిని చాటుకున్నారు. శ్రీరామనవమి నాడు జరిగే కమనీయ కల్యాణ వేడుకలో స్వామి, అమ్మవార్లు ఈ నూతన వస్త్రాలనే ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Go Back to Shorts
Sita Rama Kalyanam
Jayaraju
Bhadrachalam
Pattu Vastralu
Silk Clothes
Handloom
Secunderabad family
Sri Rama Navami
Pochampalli style
Bhadrachalam Temple

More Telugu News