Air India: అనుమతి లేని విమానాన్ని నడిపిన ఎయిరిండియా... గాల్లో 9 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి!

Air India Flight Returns to Delhi After 9 Hours Due to Permit Issue
షార్ట్స్‌లో చూడండి
ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్‌కు బయల్దేరిన విమానం, గాల్లో ఏకంగా 9 గంటల పాటు ప్రయాణించి మళ్లీ వెనక్కి ఢిల్లీలోనే ల్యాండ్ అయింది. కెనడా మార్గంలో ప్రయాణానికి అనుమతి లేని బోయింగ్ విమానాన్ని ఈ సర్వీసుకు ఉపయోగించడమే ఈ గందరగోళానికి కారణమైంది.

వివరాల్లోకి వెళితే, ఎయిరిండియాకు చెందిన ఏఐ185 విమానం గురువారం మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రయాణికులతో ఢిల్లీ నుంచి వాంకోవర్‌కు బయల్దేరింది. వాస్తవానికి ఈ మార్గంలో బోయింగ్ 777-300ఈఆర్ విమానాలకు మాత్రమే కెనడా అధికారులు అనుమతి ఇచ్చారు. కానీ, ఎయిరిండియా పొరపాటున బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానాన్ని పంపింది. విమానం బయల్దేరిన నాలుగు గంటల తర్వాత చైనా గగనతలంలోకి ప్రవేశించాక ఈ పొరపాటును గుర్తించారు. దీంతో పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి, ఢిల్లీకి సురక్షితంగా తీసుకువచ్చారు.

ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. "ఆపరేషనల్ సమస్య కారణంగా ఏఐ185 విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా దిగారు. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించి, వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మరుసటి రోజు ఉదయం ప్రయాణికులతో విమానం వాంకోవర్‌కు బయల్దేరింది" అని వివరించారు.

ఎయిరిండియా గతంలోనూ ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలున్నాయి. 2025 నవంబర్‌లో సరైన ఎయిర్‌వర్తీనెస్ రివ్యూ సర్టిఫికెట్ (ఏఆర్సీ) లేకుండానే ఎనిమిది వాణిజ్య విమానాలను నడిపినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియాకు రూ.1 కోటి జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Air India
Air India flight
Vancouver
Boeing 777
flight AI185
DGCA
Canada
Delhi to Vancouver
Airworthiness Review Certificate
flight violation

More Telugu News