మస్క్‌ సంచలనం.. ట్రంప్‌ పార్టీకి రూ.2,300 కోట్ల విరాళం!

మస్క్‌ సంచలనం.. ట్రంప్‌ పార్టీకి రూ.2,300 కోట్ల విరాళం!

Elon Musk donates 276 million dollars to Republican Party for US midterms
  • జులై నుంచి 276 మిలియన్‌ డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చిన మస్క్‌
  • సెనేట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌కు 158 మిలియన్‌ డాలర్లు
  • అమెరికా పీఏసీకి 76 మిలియన్‌ డాలర్లు
  • టెక్సాస్‌ సెనేట్‌ రేసుకు 10 మిలియన్‌ డాలర్లు
  • రిపబ్లికన్ల ఆధిపత్యం నిలబెట్టడమే లక్ష్యంగా మస్క్‌ చర్యలు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయమే లక్ష్యంగా ఎలాన్‌ మస్క్‌ భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు 276 మిలియన్‌ డాలర్లకు పైగా విరాళాలు అందించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.2,300 కోట్లు. కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగించేందుకు ఆయన ఈ నిధులను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించగా.. మస్క్‌ రాజకీయ వ్యవహారాల ప్రతినిధి ఆండ్రూ రోమియో ధ్రువీకరించారు. 

మరోవైపు ఇటీవల భారత రాజకీయాలపై మస్క్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్టార్‌లింక్‌కు అనుమతుల అంశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీని ఉద్దేశించి ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంబానీని భారత ప్రధానిగా అభివర్ణిస్తూ.. దేశ రాజకీయాలను ఆయనే శాసిస్తున్నారన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు మస్క్‌ భారీగా విరాళాలు అందించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

సెనేట్‌ రేసుపై ప్రత్యేక దృష్టి
రిపబ్లికన్‌ సెనేట్‌ అభ్యర్థులకు మద్దతుగా పనిచేసే ప్రధాన సూపర్‌ పీఏసీ ‘సెనేట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌’కు మస్క్‌ 158 మిలియన్‌ డాలర్లు ఇచ్చారు. అమెరికా రాజకీయ చరిత్రలో వ్యక్తుల నుంచి వచ్చిన భారీ విరాళాల్లో ఇదొకటిగా ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ‘అమెరికా పీఏసీ’కి తన సూపర్‌ పీఏసీ (రాజకీయ ప్రచార నిధుల సంస్థ) నుంచి మరో 76 మిలియన్‌ డాలర్లు అందించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి ఈ సంస్థ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించింది. టెక్సాస్‌ సెనేట్‌ రేసులో రిపబ్లికన్‌ అభ్యర్థి కెన్‌ పాక్స్‌టన్‌కు మద్దతిచ్చే ‘లోన్‌ స్టార్‌ లిబర్టీ పీఏసీ’కి 10 మిలియన్‌ డాలర్లు ఇచ్చారు.

మాట మార్చిన మస్క్‌
రాజకీయాలకు ఇకపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయబోనని గత మేలో మస్క్‌ ప్రకటించారు. ‘నేను ఇప్పటికే తగినంత చేశాననుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2024లో ట్రంప్‌ ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్న మస్క్‌.. ఈసారి మాత్రం తెరవెనుక నుంచే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో సమర్థత పెంపు విభాగానికి నేతృత్వం వహించిన సమయంలో ట్రంప్‌తో విభేదించినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. గత వారం మస్క్‌కు ట్రంప్‌ ‘నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌’ అందించారు.

నిధులే రిపబ్లికన్లకు బలం
అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తి, ధరల పెరుగుదల, ఇరాన్‌తో యుద్ధంపై వ్యతిరేకత రిపబ్లికన్లకు సవాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో భారీ విరాళాలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఎన్నికల చివరి దశలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్లు ప్రజాదరణ లేని అభ్యర్థులు, అధ్యక్షుడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డబ్బుతో ఎన్నికలను కొనాలని చూస్తున్నారని డెమోక్రాట్లు విమర్శించారు.
Advertisement
Elon Musk
Republican Party
Donald Trump
US Midterm Elections
Political Donations
Senate Leadership Fund

More Telugu News