Panchumarthi Anuradha: బాబాయ్‌ని చంపిన అబ్బాయిలకు జైలు ఖాయం: పంచుమర్తి అనురాధ

Anuradha Slams Jagans Attempts to Protect Accused in Vivekananda Reddy Murder Case
షార్ట్స్‌లో చూడండి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన బృందం చేస్తున్న ప్రయత్నాలను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బాబాయ్‌ని అత్యంత పాశవికంగా చంపేసిన అబ్బాయిలకు త్వరలోనే జైలు శిక్ష పడుతుంది" అని ఆమె జోస్యం చెప్పారు. ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ రాసిన స్క్రిప్ట్ ప్రకారమే సాగిందని అనురాధ విమర్శించారు. "కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందని జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై జగన్ గానీ, అవినాశ్‌ గానీ ఎందుకు నోరు మెదపడం లేదు? న్యాయం కోసం పోరాడుతున్న సునీతమ్మపై కుట్రలు చేయడం సిగ్గుచేటు" అని మండిపడ్డారు.

హత్య జరిగిన రోజు చోటుచేసుకున్న పరిణామాలను అనురాధ గుర్తుచేశారు. "ఆ రోజు సాక్షి ఛానల్‌లో రెండు గంటలకోసారి వార్త మార్చారు. గుండెపోటుతో మొదలుపెట్టి, చివరకు హత్య అని తేల్చారు. ఇదంతా జగన్ డైరెక్షన్‌లోనే జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకే హత్య విషయం జగన్‌కు తెలిసినా, ఆయన నింపాదిగా 8 గంటల పాటు కారులో ప్రయాణించారు. ఆ ప్రయాణ సమయంలోనే 'రక్తం తుడిచేయండి, కుట్లు వేయండి' అని ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చింది నిజం కాదా?" అని ఆమె నిలదీశారు. ప్రతిపక్ష నేతగా సీబీఐ విచారణ కోరిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక వద్దనడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.

సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాశ్‌ రెడ్డి కర్నూలు ఆసుప‌త్రిలో దాక్కోవడాన్ని రాష్ట్ర ప్రజలు చూశారని అనురాధ పేర్కొన్నారు. కేసును నీరుగార్చేందుకు స్వయంగా జగనే, చనిపోయిన వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం అత్యంత దారుణమని అన్నారు. "అవినాశ్‌ రెడ్డి చెప్పినట్టు ఇది 'మర్డర్ ఫర్ గెయిన్' కాదు, ఇది 'మర్డర్ ఫర్ వైసీపీ పొలిటికల్ గెయిన్'. వైసీపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ హత్య జరిగింది" అని ఆమె విమ‌ర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా సునీతకు న్యాయం జరిగి తీరుతుందని, హత్య వెనుక సూత్రధారులు, సాక్ష్యాలు తారుమారు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని అనురాధ హెచ్చరించారు.
Go Back to Shorts
Panchumarthi Anuradha
YS Vivekananda Reddy
YS Jaganmohan Reddy
YS Avinash Reddy
YS Sunitha
Andhra Pradesh Politics
Murder Case
CBI Investigation
TDP
Kadapa MP

More Telugu News