Pedana: రూ.1.50 కోట్ల చోరీని పట్టించిన గుమాస్తా పెళ్లి!

Pedana Employee Theft Exposed After Lavish Wedding
కృష్ణా జిల్లా పెడనలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో పనిచేసే గుమస్తా భారీ మోసానికి పాల్పడ్డాడు. యజమానుల నమ్మకాన్ని అవకాశంగా తీసుకుని సుమారు రూ.1.50 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను మాయం చేశాడు. ఇటీవల అతను చేసుకున్న ఘనమైన వివాహమే ఈ బాగోతాన్ని బయటపెట్టడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. పెడనకు చెందిన ఓ యువకుడు స్థానిక నగల దుకాణంలో ప్రధాన గుమస్తాగా పనిచేస్తున్నాడు. దుకాణ యజమానులు మరోచోట నివసిస్తుండటంతో, ఇదే అదనుగా కొంతకాలంగా దుకాణంలోని ఆభరణాలను పక్కదారి పట్టిస్తున్నాడు. సుమారు నెల రోజుల క్రితం ఆ యువకుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన స్థాయికి మించి అతడు ఖర్చు చేయడాన్ని గమనించిన యజమానులకు అనుమానం కలిగింది.

వెంటనే వారు దుకాణానికి వచ్చి స్టాక్ లెక్కలు సరిచూసుకోగా, భారీగా తేడా ఉన్నట్లు గుర్తించారు. గుమస్తాను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. యజమానులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు ఇంకా నమోదు కాలేదని, పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యజమానులు యువకుడి ఇంటి నుంచి కొన్ని వెండి వస్తువులను, లక్షల్లో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  
Pedana
Krishna District
Gold Theft
Silver Theft
Jewelry Store
Employee Fraud
Marriage Expenses
Crime News
Andhra Pradesh Police
Theft Case

More Telugu News